తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయాలపై అన్ని విధాలుగా అధ్యయనం చేసిన తర్వాత కేసీఆర్ రైతు ఎజెండాతో జాతీయ పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలుచెబుతున్నాయి. అయితే ఆయన ప్రాంతీయ పార్టీల నేతలతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతున్నారు. కేసీఆర్ సొంత పార్టీ పెట్టాలనుకుంటే ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశాలు ఎందుకన్నది అంతుబట్టని విషయం. రాజకీయ పార్టీ ప్రకటించిన తర్వతా ఆయా పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటున్నారని కొంత మంది చెబుతున్నారు.
కానీ అలా కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటే జాతీయ పార్టీ అవసరం లేదు. టీఆర్ఎస్ అధ్యక్షుడిగానే ఏర్పాటు చేయవచ్చు. టీఆర్ఎస్ను కాదని కొత్త పార్టీ ఏర్పాటు తర్వాత ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సఖ్యత ఉన్న పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో కూడా పోటీ చేయాల్సి ఉంటుంది. ఆయా పార్టీలు కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుని … సీట్లు కేటాయించే అవకాశం లేదు. కర్ణాటకలో జేడీఎస్ అయినా.. బీహార్‌లో ఆర్జేడీ కూటమి అయినా… ఢిల్లీలో కేజ్రీవాల్ అయినా సరే .. కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉన్నా సరే.. ఆయన పార్టీకి ఒక్క సీటు కూడా ఇచ్చే అవకాశం ఉండదు.
ఎందుకంటే ఇతర పార్టీలు బలపడటానికి ఆయా ప్రాంతీయ పార్టీలు అంగీకరించవు. మరి కేసీఆర్ ప్రాంతీయ పార్టీల నేతల్ని ఎందుకు ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నది సస్పెన్స్‌గా మారింది. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టినా అక్కడి ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే చాలా కష్టపడాల్సి ఉంటంది. దానికి సమయం సరిపోదు. అందుకే కేసీఆర్ బీజేపీని గద్దెదించాలన్న లక్ష్యంతో ఓ జాతీయ వేదికను సిద్ధం చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.