సార్వత్రిక ఎన్నికలు మరొక్క దశ మాత్రమే మగిలాయి. కానీ రాజకీయ పార్టీలకు ఫలితంపై ఓ క్లారిటీ మాత్రం వచ్చింది. గత ఎన్నికల్లో ఉన్నంత వేవ్ ఈ సారి లేదని.. ఏ జాతీయ పార్టీ అయినా మిత్రపక్షాలపై ఆధారపడాల్సిందేననేది.. ఆ క్లారిటీ అంటే కిచిడీ సర్కార్ ఖాయమనేది… పోల్ పండితులు వేస్తున్న అంచనా… !
ప్రాంతీయ పార్టీలదే ఈ సారి రాజకీయం..!
ఢిల్లీలో ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నా.. మిత్రులే ముఖ్యం కానున్నారు. ఆ మిత్రులు ఎవరికి ఎక్కువగా ఉంటే వారికే అవకాశం వస్తుందనేది ప్రాథమిక అంచనా. దేశంలో ఇప్పుడు రెండు కూటములు ఉన్నాయి. ఒకటి బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమెక్రటిక్ అలయెన్స్..రెండు కాంగ్రెస్ నేతృత్వంలోనే యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయెన్స్. బీజేపీ నేతృత్వంలోని కూటమిలో శివసేన,జేడీయూ,అకాలీదళ్ మాత్రమే అంతో ఇంతో బలం ఉన్న పార్టీలు. కాంగ్రెస్ కూటమిలో… డీఎంకే, ఆర్జేడీ, జేడీఎస్ , ఎన్సీపీ మాత్రమే అంతో ఇంతో బలం ఉన్న పార్టీలు. ఈ కూటముల్లో లేని బలమైన పార్టీలు…తటస్థంగా ఉన్నాయి.
బిజూ జనతా దళ్, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, వైసీపీ, తృణమూల్ కాంగ్రెస్, బహుజనసమాజ్ పార్టీ , సమాజ్ వాదీ పార్టీ లెఫ్ట్ పార్టీలు…ఈ జాబితాలోకి వస్తాయి. ఈ పార్టీల్లో కొన్ని బీజేపీతో దగ్గరగా… కాంగ్రెస్తో దూరంగా ఉంటున్నాయి. మరికొన్ని పార్టీ కాంగ్రెస్కు దగ్గరగా బీజేపీకి దూరంగా ఉంటున్నాయి. ఎలా చూసినా ఈ పార్టీలన్నింటికీ…కలిపి.. 200కిపైగానే సీట్లు వస్తాయనేది అంచనా. అందుకే…అందరి దృష్టి ఈ పార్టీలపై పడింది. బాగా సీట్లు సాధిస్తారని అంచనా వేసుకుంటున్న పార్టీలపై…. జాతీయ పార్టీల దృష్టి పడింది.
ఎవరికి ఎక్కువ పార్టీల మద్దతుంటే వాళ్లకే పీఠం..!
తటస్థంగా ఉన్న పార్టీల్లో… ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తాయనుకుంటున్న పార్టీలు… ఎస్పీ, బీఎస్పీ, టీడీపీ, తృణమూల్..బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత వ్యూహం..మొదట్లో బీజేపీకి దగ్గరగా ఉన్నట్లు అనిపించినా ఇప్పుడు మాత్రం… కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇక బీజేడీ, వైసీపీ విషయంలో.. భారతీయ జనతా పార్టీ కాన్ఫిడెంట్ గా ఉంది. ఆ పార్టీల మద్దతు తమకే వస్తుందని.. నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే వారితో బ్యాక్ గ్రౌండ్ చర్చలు ప్రారంభించారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కానీ ఈ రెండు పార్టీలకు ఓ కామన్ సమస్య ఉంది. అదే ఎట్టి పరిస్థితుల్లోనూ…కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీతో సన్నిహితంగా ఉండి తీరాలి. అందుకే..బీజేపీ విషయంలో సాఫ్ట్ గా ఉంటున్నాయి.. కానీ తేల్చి చెప్పడం లేదు. ఒక వేళ బీజేపీ.. అధికారానికి సుదూరంగా ఉండి… కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే మాత్రం.. ఈ రెండు పార్టీలు కూడా మనసు మార్చుకునే అవకాశం ఉంది. దీని కోసం ఆ పార్టీల వద్ద … వాదన కూడా రెడీగా ఉంది. ఒడిషాలో బీజేపీ..బీజేడీకి ప్రధాన ప్రత్యర్థిగా ఎదుగుతోంది. ఆ కారణం చూపొచ్చు. ఇక వైసీపీ… వైఎస్ ఆశయం రాహుల్ ప్రధాని కావడమేననే డైలాగ్తో సరి పెట్టేస్తుంది.
సంకీర్ణ రాజకీయాల్లో కొత్త శకం ఆరంభం …?
ఇప్పటికి తటస్థ కోటాలో ఉన్నప్పటికీ.. బీజేపీనా..కాంగ్రెస్నా అన్న ఆప్షన్ వస్తే.. కాంగ్రెస్ వైపే నిస్సంకోచంగా మొగ్గు చూపే పార్టీల జాబితాలో టీడీపీ, తృణమూల్, సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలు ఉంటాయి. ఈ సారి.. ఈ పార్టీలే… అత్యధిక సీట్లు సాధిస్తాయన్న అంచనా…రాజకీయవర్గాల్లో ఉంది. ఇవన్నీ మూకుమ్మడిగా.. కాంగ్రెస్ పార్టీ కూటమి వైపు వెళ్తే… ప్రభుత్వం మారడం ఖాయం అనుకోవచ్చనే అంచనా ఉంది. కూటమిలో లేకపోయినప్పటికీ..బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపై నిలుపుతున్న చంద్రబాబు ఈ విషయంలో…తన రాజకీయ అనుభవం మొత్తాన్ని ఉపయోగిస్తున్నారు. అంటే కేంద్రంలో… అన్నీ అనుకున్నట్లుగా జరిగితే… రాహుల్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడాలి.. లేదా… కాంగ్రెస్ మద్దతుతో ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడాలి. ఏదైనా.. కిచిడీ ప్రభుత్వమే ఖాయమవుతుంది.