లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కాంగ్రెస్ పోషించాల్సిన పాత్రలో స్పష్టమైన మార్పు వస్తోందనే చెప్పొచ్చు. మోడీ సర్కారుకు వ్యతిరేకంగా… దేశవ్యాప్తంగా భాజపాయేతర పార్టీలను కూటమి కట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భుజాలపై ఉంటుందని ఆ మధ్య అనిపించింది. కానీ, ఇప్పుడు భాజపాయేతర పక్షాలతో కలిసి కాంగ్రెస్ ముందుకు సాగాల్సిన వాతావరణం కనిపిస్తోంది. కోల్ కతా ర్యాలీ తరువాత భాజపాయేతర కూటమి బలంగా ఉండబోతోందనే సంకేతాలు మరోసారి వెలువడ్డాయి. అంతేకాదు, ఈ కూటమిలో కాంగ్రెస్ ఉన్నా కూడా, ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఉంటారనే ప్రకటన కూడా ఎన్నికలు ముందు సాధ్యం కాదనే పరిస్థితీ ఏర్పడింది.
కాంగ్రెస్ పార్టీ కంటే మాకే ఎక్కువ లోక్ సభ స్థానాలు వస్తాయంటూ ఇటీవలే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. అంటే… ఓరకంగా దీన్నీ సవాలుగా స్వీకరించాల్సిన అవసరం రాహుల్ గాంధీకి ఉంది. ఎందుకంటే, ప్రస్తుతం భాజపాకి ధీటైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే, సోలో పార్టీగా ఇప్పుడున్న పట్టు కొనసాగించినంత మాత్రాన సరిపోదు. దీనికి మించిన బలాన్ని సంపాదించుకోవాలి. అంటే, గతంలో ఏయే రాష్ట్రాల్లో అయితే కాంగ్రెస్ కి పట్టు ఉండేదో… అక్కడ మళ్లీ సొంతంగా పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ మీద ఉంది.
ఉత్తరప్రదేశ్ పరిస్థితే తీసుకుంటే… అక్కడ ఎస్పీ, బీఎస్పీలు ఒకటయ్యాయి. మాయావతి, అఖిలేష్ యాదవ్ లు కాంగ్రెస్ కి కొంత అనుకూలంగా ఉన్నారని అనుకుంటున్నా… అంత పెద్ద రాష్ట్రంలో భాజపాతోపాటు కాంగ్రెస్ కి కూడా ఎంపీ సీట్లు ఎక్కువగా దక్కనీయకూడదనే వ్యూహంతోనే ఉన్నారు. గతంలో కాంగ్రెస్ కి బాగా పట్టున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ కూడా ఉండేది. పార్టీ మళ్లీ బలం పుంజుకోవాలంటే… ఉత్తరప్రదేశ్ లో మరోసారి గత వైభవం పొందాలి. ఆ రాష్ట్రమ్మీద ఫోకస్ పెడితే… సహజంగా ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా దాని ప్రభావం ఉంటుందనేది రాహుల్ గాంధీ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే, ఇప్పుడు ప్రియాంకా గాంధీని తూర్పు ఉత్తరప్రదేశ్ కి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిని చేశారు. దేశవ్యాప్తంగా పార్టీ తరఫున ప్రచారం చేయగలిగే స్టార్ కేంపెయినర్ ని యూపీకి పరిమితం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నా… రాహుల్ లక్ష్యమైతే కాంగ్రెస్ కి సోలోగా అత్యధిక స్థానాల్లో గెలుపు అన్నదే కనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీలతో మోడీకి వ్యతిరేకంగా పోరాడుతూ… ఆ ప్రాంతీయ పార్టీల కూటమిలో బలమైన శక్తిగా పార్టీని నిలపాల్సిన బాధ్యత కూడా రాహుల్ పై ఉన్నట్టుగా చెప్పొచ్చు. ఓరకంగా చెప్పాలంటే… ప్రాంతీయ పార్టీల కూటమిలో ఉంటూ, వారితోనే పోటీ పడాల్సిన అవసరం కాంగ్రెస్ ముందుంది.