తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. కేంద్రంలో రాబోయేది కచ్చితంగా… ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వమని కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే.. తన రాష్ట్రంలో ఉన్న పదహారు సీట్లను సాధించి.. ఇతర ప్రాంతీయ పార్టీలను కలుపుకుని.. ఈ సారి ఢిల్లీలో చక్రం తిప్పాలనుకుంటున్నారు. జాతీయ మీడియా ఇంటర్యూల్లో తన ఆలోచనలు, రాజకీయాలపై దృక్కోణాన్ని స్పష్టంగా వివరిస్తున్నారు. తాజాగా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్యూలో కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్, బీజేపీల నుంచి దేశానికి విముక్తి కావాలి..!
లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కానీ… కాంగ్రెస్ పార్టీ కానీ పూర్తి స్థాయి మెజార్టీ సాధించడం అసాధ్యమన్న తన అంచనాను.. జాతీయ మీడియాకు కేసీఆర్.. నిర్మోహమాటంగా చెప్పారు. బీజేపీకి కచ్చితంగా సీట్లు తగ్గిపోతాయన్నారు. ఏకంగా నలభై శాతం ఓట్లు ప్రాంతీయ పార్టీలకు వస్తాయని.. వారే దేశాన్ని శాసించబోతున్నారన్నారు. ఈ విషయంలో.. తన రాజకీయ విశ్లేషణను కేసీఆర్ సమర్థంగా వివరించారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అని బీజేపీ.. బీజేపీ ముక్త్ భారత్ అని కాంగ్రెస్ అంటున్నాయని.. కానీ.. రెండింటి నుంచి దేశానికి విముక్తి కావాల్సి ఉందని కేసీఆర్ తన దృక్కోణాన్ని వివరించారు. రెండు జాతీయ పార్టీలు దేశాన్ని ఇంత కాలం పరిపాలంచి.. ఏం చేశాయని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. మనకన్నా.. ఎంతో వెనుకబడి ఉండే.. చైనా ఇప్పుడు ఎలా ముందుకు వెళ్లిందని… ప్రశ్నిస్తున్నారు. చైనా వైశాల్యంలో పెద్దదైనా.. సాగుభూమి.. ఇండియాలోనే ఎక్కువ ఉంటుందని.. కానీ వెనుకబడిపోయామని… చెబుతున్నారు.
ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర..!
ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు సాధించబోయే సీట్లతోనే… కేంద్రంలో అధికారం సాధిస్తాయని… కేసీఆర్ చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీల ప్రభుత్వం ఏ మాత్రం.. అస్థిరతతో ఉండబోదని కేసీఆర్ విశ్లేషిస్తున్నారు. దేశంలో ఇంత కాలం.. జాతీయ పార్టీలు.. స్థిరమైన ప్రభుత్వాలు పరిపాలించినప్పటికీ.. కరెంట్ కొరత, నీటి కొరత ఎందుకున్నాయని.. ప్రశ్నిస్తున్నారు. అన్ని అంశాలపై సాధికారికంగా అధ్యయనం చేసిన కేసీఆర్.. ఎలాంటి మౌలికమైన మార్పులు దేశంలో వస్తే.. దేశానికి మంచిదో విశ్లేషణాత్మకంగా చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీలు.. ఈ సారి.. చరిత్ర సృష్టించబోతున్న విషయాన్ని ఆయన కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఎన్డీటీవీ ఇంటర్యూలో ముగ్గురు జర్నలిస్టులు.. ఎలాంటి ప్రశ్నలు వేసినా.. సాధికారికంగా సమాధానాలు ఇచ్చారు. తన విజన్ ఏమిటో చెప్పారు.
దేశ సమస్యలపై స్పష్టమైన అవగాహన..!
కేసీఆర్.. తెలంగాణ విషయంలో.. తెలంగాణ సాధన విషయంలో ఎంత స్పష్టమైన అవగాహన లక్ష్యంతో ఉన్నారో.. ప్రస్తుతం దేశ రాజకీయాల విషయంలోనూ.. అదే క్లారిటీతో ఉన్నారు. దేశానికి ఏది అవసరమో.. దేశ ప్రజలకు ఏది మంచిదో.. ఆయన స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. జాతీయ మీడియా ముందు తన ఆలోచనలు అన్నీ వివరిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో తన పాత్ర రాజకీయానికి మాత్రమే పరిమితం కాదని.. అంతకు మించి ఉంటుందని…నమ్మకంగా చెబుతున్నారు. మొత్తానికి ఇప్పుడు.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ప్రాంతీయ పార్టీల కూటమిలో ఆయన లేరు. ఇప్పుడు పార్టీలన్నీ.. రెండు గ్రూపులుగా విడిపోయారు. ప్రో మోడీ, యాంటీ మోడీ. ఈ రెండింటిలోనూ కసీఆర్ లేరు. కానీ ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన మాత్రం మనసులో స్థిరంగా ఉంది. ఎన్నికల తర్వాత దాన్ని పట్టాలెక్కించగలనని ఆయన నమ్మకంగా ఉన్నారు.