భారతీయ జనతా పార్టీ.. వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోంది. పరిస్థితులను అర్థం చేసుకోలేక.. చేజేతులా… అధికారాన్ని దూరం చేసుకునే పరిస్థితికి వస్తోంది. చివరి విడతకు ముందు.. ఢిల్లీలో మారుతున్న రాజకీయ పరిస్థితులే.. ఈ అంశాన్ని సూచిస్తున్నాయి. గెలుపు మాదే అంటూ… బీజేపీ నేతలు అత్యంత గర్వాన్ని ప్రదర్శిస్తూ.. ప్రాంతీయ పార్టీలపై.. విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఫలితంగా… మిగిలిన పార్టీలన్నీ.. కాంగ్రెస్ కు దగ్గరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా.. బీజేపీ మైండ్‌సెట్‌ను అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా పావులు కదుపుతోంది.
మిత్రులొద్దని అనుకుంటున్న బీజేపీ..!
ఢిల్లీ రాజకీయాల్లో ఎలా చూసినా.. ఈ సారి మిత్రపక్షాలే కీలకమని.. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదన్న విషయం స్పష్టమయింది. ఒక్క బీజేపీ నేతలు.. అదీ కూడా.. అధికారాన్ని అనుభవిస్తున్న అగ్రనేతలు … ఈ విషయాన్ని అంగీకరించడం లేదు. తాము 300 సీట్లు గెలవబోతున్నామనే ఊహాల్లో ఉన్నారు. పార్టీ శ్రేణులకు… ధైర్యం రావడానికి అలా చెబుతున్నారేమోనని.. అందరూ అనుకుంటున్నారు కానీ.. నిజానికి.. వారి కాన్ఫిడెన్స్ లెవల్స్ అలానే ఉన్నాయి. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అని బయట చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కొత్త మిత్రులు అవసరం కాబట్టి.. వారిని దగ్గర చేసుకునేందుకు .. ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడమే దీనికి కారణం. అలా చేయకపోగా.. శత్రుత్వాన్ని మాత్రం పెంచుకుంటున్నారు.
ప్రాంతీయ పార్టీలను చేరదీస్తున్న కాంగ్రెస్..!
తమకు.. బీజేడీ, టీఆర్ఎస్, వైసీపీల నుంచి మద్దతు వస్తుంది.. ఆ పార్టీలకు కలిసి కనీసం యాభై సీట్లు వస్తాయని బీజేపీ లెక్కలు వేసుకుంది. కానీ… ఈ పార్టీ బీజేపీకి ఇంత కాలం ఎందుకు సపోర్ట్‌గా నిలబడ్డాయని ఆలోచిస్తే… మోడీ, షాలతో లేనిపోని తిప్పలు ఎందుకని వారు… మద్దతుగా నిలిచారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో వేధింపులు పడటం ఎందుకని సైలెంట్‌గా ఉన్నారు. అంతే కానీ.. వారేమీ బీజేపీపై అభిమానంతో లేదు. బీజేపీకి అధికారం పోతుందని తెలిసిన మరుక్షణం.. వారు దూరమైపోతారు. ప్రస్తుతం ఇదే జరుగుతోంది. టీఆర్ఎస్, బీజేడీ.. కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా.. వాటిని .. తమ వైపు లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇక వైసీపీ.. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారికి అండగా ఉండాల్సిందే. అది కాంగ్రెస్ అయినా.. బీజేపీ అయినా..!
బీజేపీకి మిత్రులని పేరు పడిన వారూ దూరమవుతున్నారు..!
బీజేపీ మిత్రుల్ని ఏ మాత్రం మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నించకపోవడంతో.. కాంగ్రెస్ పార్టీ తన .. కార్యాచరణను చురుగ్గా ప్రారంభించారు. నేరుగా సోనియా గాంధీ నేతృత్వంలో ప్రాంతీయ పార్టీల కూటమి భేటీ ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు కానీ.. ఇతరులు కానీ.. ఏర్పాటు చేస్తే.. వచ్చేందుకు కొంత మంది వెనుకాడే అవకాశం ఉంది కాబట్టి.. ఈ వ్యూహం అమలు చేస్తున్నారు. ఈ భేటీకి వెళ్లే నేతలు.. ఇక బీజేపీకి మద్దతివ్వడం కష్టం కావొచ్చు. టీఆర్ఎస్ , బీజేడీలు సానుకూలంగా ఉన్నాయన్న ప్రచారం ఊపందుకుంటోంది. అదే సమయంలో… కాంగ్రెస్ పార్టీ.. మిత్రపక్షాలను ఆకట్టుకోవడానికి… ప్రధానమంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ నేతకే దక్కాలని పట్టుబట్టబోమని చెబుతోంది. దాంతో.. ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న వారు కూడా… దగ్గరకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెంగాల్ లో బీజేపీ వ్యవహరిస్తున్న తీరుతో… మమతా బెనర్జీ కూడా… తన ప్రధాని పదవి కన్నా.. బీజేపీని కట్టడి చేయడమే ప్రథమ కర్తవ్యమని నమ్ముతున్నారు. మొత్తానికి విపక్షాల ఐక్యత విషయంలో.. బీజేపీకే ఎక్కువ క్రెడిట్ దక్కుతోందన్న అభిప్రాయం ఏర్పడుతోంది.