దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎన్నికల తర్వాత దేశంలో మూడు రకాల పరిస్థితులు ఉండే అవకాశాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. బీజేపీ మిత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదా.. కాంగ్రెస్ పార్టీ మిత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం…! ఈ రెండూ కాకపోతే.. బీజేపీ లేదా కాంగ్రెస్ మద్దతుతో ప్రాంతీయ పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం..!. ఇప్పుడున్న మిత్రులతో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం అసాధ్యం.
ఇప్పటికీ కూటమిగా ఏర్పడకుండానే అధికారంపై ఆశలా..?
ప్రాంతీయ పార్టీలన్నీ ఇప్పటి వరకూ కూటమిగా ఏర్పడలేదు. కానీ… అన్ని పార్టీలను సమైక్యంగా ఉంచడానికి.. చంద్రబాబు లాంటి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్, లెఫ్ట్ , బీజేడీ, టీడీపీ, టీఆర్ఎస్, లాంటి పార్టీలన్నీ కలిపి ..రెండు వందల సీట్లు గెలుచుకుంటాయన్న అంచనా ఉంది. అదే జరిగి.. అన్ని పార్టీలు ఒకే వేదిక కిందకు వస్తే.. ఏదో ఒక జాతీయ పార్టీ మద్దతివ్వక తప్పని పరిస్థితి వస్తుంది. కర్ణాటకలో… 38 అసెంబ్లీ సీట్లు వస్తేనే… కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అంటే.. దక్షిణాదిలో ముఖ్యంగా కర్ణాటకలో బీజేపీకి అధికారం దక్కనీయకూడదన్న ఉద్దేశంతోనే.. కాంగ్రెస్ పార్టీ.. తను సాధించిన సీట్లలో సగం కూడా గెలుపొందని జేడీఎస్ కు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసింది. ఢిల్లీ రాజకీయాల్లోనూ కర్ణాటక పరిస్థితి ఉండే అవకాశం ఉంది.
కర్ణాటక తరహాలో కాంగ్రెస్ త్యాగానికి రెడీయేనా..?
బీజేపీకి, ప్రధానమంత్రి నేరంద్రమోదీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమయ్యాయి. బద్దశత్రువుల్లాంటి పార్టీలను కూడా బీజేపీ వ్యతిరేకతే ఏకం చేసింది. కాంగ్రెస్ కు అధికారం ఇవ్వకూడదని బీజేపీ.. బీజేపీకి అధికారం ఇవ్వకూడదని.. కాంగ్రెస్ రెండూ పోటీ పడి.. ప్రాంతీయ పార్టీల నేతలకు ప్రధానమంత్రి పదవిని ఆఫర్ చేయవచ్చు. ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలకమైతే.. వాటి తరపున ప్రధానమంత్రి అయ్యే వారికి మద్దతు ఇవ్వడానికి బీజేపీ .. కన్నా కాంగ్రెస్‌నే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. ఎందుకంటే.. బీజేపీ మద్దతు కన్నా..కాంగ్రెస్ మద్దతు తీసుకోవడానికే ఎక్కువ ప్రాంతీయ పార్టీలు సిద్ధపడతాయి. ప్రాంతీయ పార్టీల నేతల్లో ప్రధాని పదవి చేపట్టగల నేతల చాలా మంది ఉన్నారు. మాయవతి, మమతాబెనర్జీ, చంద్రబాబు , ములాయం, శరద్ పవార్ , దేవేగౌడ వంటి వారు ఈ జాబితాలో ఉంటారు.
ప్రధానమంత్రి అభ్యర్థే అసలు చిక్కు సమస్య..!
బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రధాని పదవిపై ఆశలు పెట్టుకున్నారు. సమాజ్ వాదీ పార్టీ కూడా మాయావతిని ప్రధానిగా ప్రతిపాదిస్తోంది. కానీ… మాయవతికి ప్రధానమంత్రిగా అవకాశం వస్తే.. ఆమె పార్టీని దేశమంతా విస్తరింపచేసుకుంటారు. ఇది కాంగ్రెస్ కు నష్టం. తాను మద్దతిచ్చి తన పార్టీకి నష్టం చేసుకోవాలని కాంగ్రెస్ అనుకోదు. ఇక మమతా బెనర్జీ. బెంగాల్ సీఎం ప్రధానమంత్రిగా అయ్యే విషయంలో ప్రధాన అడ్డంకి లెఫ్ట్ పార్టీల నుంచి వస్తుంది. ఇటీవల..లెఫ్ట్ పార్టీలతో మమతా బెనర్జీ కాస్త సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. లెఫ్ట్ పార్టీల ఆమోదం లేకుండా కాంగ్రెస్ మద్దతుతో ప్రధాని కావడం చంద్రబాబు విషయంలో ఏ పార్టీకి పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. ఇప్పటికే శరద్ పవార్, దేవేగౌడ..చంద్రబాబు పేరును ప్రతిపాదించారు కూడా. రాజకీయాలకు సంబంధం లేకుండా.. బయట నుంచి కూడా చంద్రబాబు అభ్యర్థిత్వానికి మద్దతు లభించవచ్చు. ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన వ్యక్తిగా.. భారత వ్యాపారరంగం… చంద్రబాబుకు ఏకగ్రీవంగా మద్దతు పలుకుతుంది.