తెలుగు రాష్ట్రాల రియల్ ఎస్టేట్‌కు రెండు ప్లస్ పాయింట్లు వృద్ధికి అవకాశం కల్పిస్తున్నాయి. ఏపీకి అమరావతి కాగా.. హైదరాబాద్‌కు రీజనల్ రింగ్ రోడ్. అమరావతి వల్ల హైదరాబాద్ ఏమైనా మైనస్ అవుతుందని అనుకుంటే… అది పూర్తిగా తప్పని నిరూపితమయింది. రీజనల్ రింగ్ రోడ్ కారణంగా రియల్ ఎస్టేట్ అటు వైపు పుంజుకుంటోంది. ఇది అనూహ్యమైన వృద్ధికి కారణం కానుంది .
ఏపీలో అమరావతి నిర్మాణం మళ్లీ పట్టాలెక్కనుంది . ప్రస్తుతం జంగిల్ క్లియరెన్స్ జరుగుతోంది. మధ్యలో ఆగిపోయిన నిర్మాణాలను వాటి పటిష్టతపై నివేదికలు వచ్చిన తర్వాత కంటిన్యూ చేయనున్నారు. ఇప్పటికే అమరావతి బూస్ట్ ఏపీ మొత్తం కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది. మామూలుగా అయితే రాజధాని చుట్టుపక్క మాత్రమే పెరుగుతుంందని అనుకుంటటారు. కానీ ప్రభుత్వం చేపట్టే వివిధ రకాల ప్రాజెక్టుల వల్ల… పరిశ్రమల ఊహాగానాల వల్ల ఏపీ మొత్తం రియల్ ఎస్టేట్ పుంజుకుంది. రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. ఎన్నికలకు ముందు ఉన్న ధరలతో పోలిస్తే రెట్టింపు అయ్యాయి. ఇళ్ల నిర్మాణం జోరుగా సాగే అవకాశం ఉంది.
ఇదే హైదరాబాద్‌లో అమరావతితో సమానంగా రీజినల్ రింగ్ రోడ్ ఎఫెక్ట్ చూపిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 40 కి.మీ పరిధి వరకు రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తంగా 347.84 కిలోమీటర్ల మేర రెండు భాగాలుగా ఆర్ఆర్ఆర్ను నిర్మించనున్నారు. రహదారికి అవసరమైన భూసేకరణకు అయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాల్సి ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఈ ప్రాజెక్టు విషయంలో ముందడుగు పడుతోంది. భూసేకరణ పూర్తయి శంకుస్థాపన జరిగే నాటికి ఆ రీజినల్ రింగ్ రోడ్ చుట్టూ రియల్ ఎస్టేట్ ఊపందుకోనుంది.
నిజానికి అమరావతి అయినా… రీజనల్ రింగ్ రోడ్ అయినా ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయి. వాటిపై అంచనాలు ఎక్కువగా ఉండటంతో వాటిని కేంద్రంగా చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందుతోంది. వారి అంచనాలను అందుకునేలా ప్రభుత్వాలు పనితీరు చూపిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాలు అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా శరవేగంగా మారిపోతాయి.