వైఎస్ హయంలో హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్ ఓ కీలకమైన ప్రాజెక్టు… హైదరాబాద్ రియల్ బూమ్ కు ఓ కారణం… ఇప్పుడు ఈ ఓఆర్ఆర్ కు అవతల నిర్మించబోతున్న ఆర్.ఆర్.ఆర్ సీఎం రేవంత్ రెడ్డికి గేమ్ ఛేంజర్ కాబోతుందా?
సీఎం రేవంత్ రెడ్డికి రియల్ రంగంపై మంచి పట్టుంది. ఇప్పుడున్న హైదరాబాద్ ఓఆర్ఆర్ టచ్ అయ్యింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వైపు ఎప్పుడో దాటేసింది. ఈ సమయంలో ఏ ప్రాజెక్టులు రావాలన్నా, కొత్తగా సర్కార్ కు ఓ బ్రాండ్ ఇమేజ్ దక్కాలన్నా గ్రేటర్ హైదరాబాద్ అవతలే.
అందుకే కేసీఆర్ సర్కార్ మూలన పెట్టిన రీజినల్ రింగ్ రోడ్డును సీఎం రేవంత్ రెడ్డి ముందేసుకున్నారు. రెగ్యూలర్ గా సమీక్ష నిర్వహిస్తూ, కేంద్ర ప్రభుత్వ కొర్రీలను క్లియర్ చేస్తూ… టెండర్ల దశకు తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు సంవత్సరాల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకొని, ఇక నుండి సీఎంవోలో ఓ అధికారికి వారం వారం డెవలప్మెంట్ రివ్యూ చేసే అధికారాన్ని ఇచ్చారు. తాను కూడా ప్రతి నెలా ఒక రోజు రివ్యూ చేస్తానని ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూ సేకరణ, హద్దులు ఏర్పాటు చేయటం వంటి కీలక సమస్యల పరిష్కారంతో పాటు పరిహారం విషయంలో పట్టింపులకు పోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాదు ఓఆర్ఆర్ కు ఆర్.ఆర్.ఆర్ అనుసంధానం చేస్తూ 12 రేడియల్ రోడ్స్ నిర్మిస్తున్నారు. ఇక నుండి కొత్తగా ఇచ్చే టౌన్ షిప్పులు, కంపెనీల అనుమతులు అన్నీ ఈ రెండు రోడ్ల మధ్యలో వచ్చేట్లు చూసుకుంటున్నారు. తద్వారా బూమ్ వస్తుందని… అది కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ సర్కార్ మైలేజ్ వస్తుందన్న భావనలో సర్కార్ పెద్దలున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ప్రచార అస్త్రంగా వాడుకునే వీలు కలుగుతుందని భావిస్తున్నారు.