ఏ విషయంలోనైనా ఫీడ్ బ్యాక్ చాలా ముఖ్యం. సినిమాలకైతే మరీను. తమ సినిమా తమకెప్పుడూ బంగారంలానే కనిపిస్తుంది. బ్లాక్ బ్లస్టర్ అనిపిస్తుంది. కానీ బయట వాళ్లకే తప్పులు తెలుస్తాయి. అందుకే… సినిమా విడుదలకు ముందు కొంతమందికి చూపించడం అలవాటు చేసుకుంటున్నారు సినీ జనాలు. `గుఢచారి`కీ అలాంటి ఫీడ్ బ్యాకే తీసుకున్నాడు అడవిశేష్. ఈ సినిమాని విడుదలకు ముందే విడతల వారీగా దాదాపు వెయ్యిమందికి చూపించాడు అడవిశేష్. వాళ్లందరి ఫీడ్ బ్యాక్లనూ తీసుకున్నాడు. ఎక్కడ సినిమా స్లోగా ఉంది? ఎక్కడ లాజిక్కులు మిస్సవుతున్నాయి? అనే విషయంలో ఆరా తీశాడు. వాళ్ల అభిప్రాయాలకు విలువ ఇస్తూ రీషూట్లు కూడా చేసుకుంటూ వెళ్లాడు. ఈ కసరత్తు మంచి ఫలితమే ఇచ్చింది. శుక్రవారం విడుదలైన `గూఢచారి` రిపోర్ట్ బాగుంది. స్క్రీన్ ప్లే పరంగా మంచి మార్కులు పడుతున్నాయి. అలాగని పూర్తి దోషరహితంగా సినిమా తీశారని కాదు, అక్కడక్కడ కొన్ని లాజిక్కులు మిస్సయినా… ఈ కథని దాదాపుగా కన్వెన్సింగ్గా చెప్పే ప్రయత్నం అయితే చేయగలిగారు. నిజానికి ఇది సురేష్ బాబు స్కూలు. ఆయన్నుంచి ఓ సినిమా వస్తోందంటే… రామానాయుడు స్టూడియోలో ప్రతీరోజూ నాలుగు షోలు పడుతుంటాయి. ఎవరెవరో వెళ్లి సినిమా చూసొస్తుంటారు. వాళ్ల వాళ్ల అభిప్రాయాలు చెబుతుంటారు. దాన్ని బట్టి చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వెళ్తారు. ఇలాంటి ఫీడ్ బ్యాక్తోనే సురేష్ ప్రొడక్షన్స్ ఇప్పుడు మంచి ఫలితాలు సాధిస్తోంది.