ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ గెలవడానికి .. తెలంగాణ సీఎం కేసీఆర్ తన వంతు సాయం చేశారు. టీడీపీని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టారు. జగన్‌తో కలిసి ఏపీకి ప్రత్యేకహోదా సాధించుకొస్తామని ప్రకటించారు. రాయలసీమను రత్నాల సీమ చేస్తామన్నారు. ఇక వైసీపీ నేతలను.. కేసీఆర్‌ను.. ఇంద్రుడు.. చంద్రుడు అంటూ పొగిడేశారు. పదవి చేపట్టిన మూడు నెలల కాలంలో.. కనీసం పది సందర్భాల్లో.. కేసీఆర్ – జగన్ భేటీ అయ్యారు. కానీ.. ఇటీవలి కాలంలో వారు ఎదురుపడటానికి కూడా ఇష్టపడటం లేదు. కొన్ని శుభకార్యాలకు వెళ్లినప్పుడు కూడా.. వేర్వేరుగా వెళ్తున్నారు… కానీ.. ఎదురుపడటం లేదు. కేసీఆర్ సంగతేమో కానీ.. జగనే పూర్తిగా ఎవాయిడ్ చేస్తున్నారన్న ప్రచారం వైసీపీ వర్గాలు చేస్తున్నాయి.
కేసీఆర్ తమను జోకర్లా ఉపయోగించుకుంటున్నారన్న ఫీలింగ్ వైసీపీ వర్గాల్లో మొదటి నుంచి ఉంది. కానీ జగన్ .. టీఆర్ఎస్ అధినేతతో.. అత్యంత ఆత్మీయంగా మెలుగుతూండటంతో సైలెంటయిపోయారు. ఆ తర్వాత కేసీఆర్.. పోలవరం ఎత్తు తగ్గింపు వంటి వివాదాస్పద ప్రకటనలు మాత్రమే కాదు.. తమ మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని కూడా లీక్ చేశారని.. జగన్ వర్గీయులు అంచనాకు వచ్చారు. సీబీఐ బెయిల్ రద్దు పిటిషన్ వేస్తే.. ఏం చేయాలన్నదానిపై ప్రగతి భవన్ మీటింగ్ లో చర్చలు జరపడం.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 175 ఎకరాల వ్యవహారం, కేంద్రంపై పోరాటం చేయాలనే ఉద్దేశం ఇవన్నీ.. మీడియాలో వచ్చేశాయి. దీంతో.. కేసీఆర్ పై.. జగన్ నమ్మకం కోల్పోయారని.. వీలైనంత దూరంగా ఉండటం మంచిదనే నిర్ణయానికి వచ్చారని .. వైసీపీలో కీలక నేతలు చెబుతున్నారు. కేసీఆర్ తో సఖ్యతగా మెలగడంతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమను దూరం పెడుతున్నదనే అభిప్రాయానికి జగన్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే అమిత్ షా తో అపాయింట్మెంట్ కోసం ఇబ్బంది పడాల్సి వచ్చిందని అంటున్నారు. సీబీఐ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు దొరకలేదని భావిస్తున్నారు.
కేసీఆర్ కూడా జగన్ తీరుపై గుర్రుగా ఉన్నట్లు ఇటీవల ఆయన మాట తీరుతోనే తేలిపోయింది. ఆర్టీసీ విలీనం అసంభవం అనే చెప్పే సందర్భంలో ఏపీ సర్కార్ ఏమీ చేయదని తేల్చేశారు. అదే సమయంలో తనకు వ్యతిరేకంగా ఉన్న తెలంగాణ వారిని తీసుకెళ్లి జగన్ పెద్ద పదవులు కట్టబెట్టారు. ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తెలంగాణా ప్రభుత్వం పై విమర్శలు గుప్పించి విఆర్ఎస్ తీసుకున్నారు. వెంటనే ఆయనను ఏపీ విద్యా శాఖ సలహాదారు గా నియమించుకున్నారు. కేసీఆర్ అంటే గిట్టని జర్నలిస్టులు దేవులపల్లి అమర్, రామచంద్ర మూర్తిలకు కూడా సలహాదారు పదవులు ఇచ్చారు. కేంద్రం నుండి పూర్తిగా ఆదేశాలు రాకముందే స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మిలను అనధికారికంగా విధుల్లోకి తీసుకోవడంపైనా కేసీఆర్ .. ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు. మొత్తానికి కేసీఆర్ – జగన్ హనీమూన్ పీరియడ్ ముగిసిందనే ప్రచారం మాత్రం రెండు రాష్ట్రాల అధికారుల్లో జరుగుతోంది.