చిత్రసీమలో ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. డబ్బు ఇచ్చేటప్పుడు, తీసుకొనేటప్పుడూ, ఖర్చు పెట్టేటప్పుడూ ఓ పద్ధతంటూ ఉండాలి. మహా, మహా నటులే, ఆర్థిక క్రమశిక్షణ లేక, జీవిత చరమాంకంలో చాలా ఇబ్బందులు పడ్డారు. చివర్లో… అద్దె ఇళ్లలో బతికి, ఆసుపత్రి ఖర్చులకు కూడా డబ్బులు లేక, అవస్థలు పడిన గాథలు ఎన్నెన్నో. ఎన్టీఆర్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. తను అప్పు ఇచ్చే విషయంలోనూ, ఇచ్చిన అప్పు వసూలు చేసే పద్ధతిలోనూ నిక్కచ్చితనం పాటించేవారు. అందుకు ఓ ఉదాహరణ ఇది.
‘శభాష్ రాముడు’ సినిమా రోజులు అవి. ఎన్టీఆర్ హీరో. కాంతారావు విలన్. దుండి నిర్మాత. షూటింగ్ జరుగుతోంది. అమ్మమ్మకు అనారోగ్యంగా ఉందన్న విషయం తెలుసుకొన్న కాంతారావు, ఉన్నట్టుండి సొంత ఊరు వెళ్లాల్సివచ్చింది. చేతిలో డబ్బుల్లేవు. అప్పటికే సినిమా పారితోషికంలో కొంత మొత్తం అడ్వాన్స్ రూపంలో తీసుకొన్నారు కాంతారావు. మిగిలిన మొత్తం అందాలంటే, షూటింగ్ అవ్వాల్సిందే. అప్పటి వరకూ దుండీ నుంచి చిల్లిగవ్వ కూడా రాదు. అందుకే.. పది వేల రూపాయలు అప్పుగా ఇవ్వాలని, మరో సినిమా నుంచి అడ్వాన్సు రాగానే తిరిగి ఇచ్చేస్తానని దుండీ ముందు చేతులు చాచి నిలబడ్డారు కాంతారావు. కానీ దండి డబ్బుల విషయంలో మహా మొండి. ‘షూటింగ్ అయ్యేంత వరకూ డబ్బులు ఇచ్చేది లేదు’ అని ఖరాఖండీగా చెప్పేశారు. ఇదంతా దూరం నుంచి ఎన్టీఆర్ గమనిస్తూనే ఉన్నారు. కాంతారావు దిగాలుగా ఇంటిమొహం పడుతున్నప్పుడు.. ఎన్టీఆర్ పిలిచి.. ‘డబ్బులు అవసరం ఉందని విన్నాను బ్రదర్.. ఇంటికొచ్చి తీసుకెళ్లండి’ అని అభయహస్తం అందించారు. కాంతారావు అవసరం తీరింది.
అయితే మనుషులు అవసరం ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా ఆలోచిస్తారు కదా? కాంతారావు కూడా అదే చేశారు. `శభాష్ రాముడు` షూటింగ్ జరుగుతుండగా ఇంకొన్ని సినిమాలు ఒప్పుకొన్నారు. అడ్వాన్సులు అందుకొన్నారు. కానీ ఎన్టీఆర్ అప్పు మాత్రం తీర్చలేదు. ‘తీరుద్దాంలే..’ అనుకొన్నారో, ‘అన్నగారు పట్టించుకోరులే’ అని లైట్ తీసుకొన్నారో తెలీదు కానీ, తమ మధ్య ఆ ప్రస్తావనే లేనట్టు ప్రవర్తించారు. ‘శభాష్ రాముడు’ షూటింగ్ కి అదే చివరి రోజు. దుండీ బాలెన్స్ ఉన్న పేమెంట్స్ అన్నీ సెట్లోనే ఇచ్చేస్తున్నారు. కాంతారావు కూడా తనకు రావాల్సిన మొత్తం తీసుకొందామని ఉత్సాహంగా వెళ్తుంటే.. ఎన్టీఆర్ ఎదురొచ్చారు. ‘బ్రదర్.. మీకు రావాల్సిన రూ.10 వేలు.. నేనే తీసుకొన్నాను. ఎలాగూ నాకు మీరు బాకీ పడ్డారు కదా..’ అంటూ పలకరించారు. దాంతో కాంతారావు అవాక్కయ్యారు. ఎన్టీఆర్ డబ్బుల విషయంలో ఇంత నిక్కచ్చిగా ఉంటారా? అనే విషయం కాంతారావుకి తొలిసారి అర్థమైంది. ఎన్టీఆర్ కాంతారావు విషయంలోనే కాదు, అందరి దగ్గరా ఇంతే. తనకు రావాల్సిన బాకీ ముక్కు పిండి వసూలు చేసేవారు. అందుకు ఇదో ఉదాహరణ మాత్రమే. ఈ ఉదంతాన్ని కాంతారావు తన స్వీయ చరిత్ర ‘అనగనగా రాజకుమారుడు’ లో రాసుకొచ్చారు కూడా.