తెలంగాణ శాసనసభలో నవంబరు 7న బిజెపి సభ్యులు నిరసన ఉద్రిక్తతకు దారితీస్తున్నప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ ఏదో సర్దిచెప్పి వారి ఆందోళన విరమించపచేశారు. అయితే ఎంఎల్ఎ చింతల రామచంద్రారెడ్డి కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి ముందున్న మైకును లాగివేయడంపై మాత్రం ఆయన ప్రస్తావించలేదు. స్పీకర్ కూడా దీన్ని అభిశంసించలేదు.ఈ విషయమై మజ్లిస్ నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. బిజెపితో మంచిగా వుండేదుకూ విన్ విన్ పరిస్థితి కోసం కెసిఆర్ మౌనం దాల్చారని విమర్శించారు. వాస్తవానికి ఇది విన్‌విన్ కాదు,మజ్లిస్ బిజెపిలతో ట్విన్ విన్ ఆయన కోరుకుంటున్నారని నేను ట్వీట్ చేశాను. అందుకు తగినట్టే ఈ రోజు అక్బర్ కెసిఆర్‌ను రెచ్చిపోయి పొగిడేశారు. ముస్లిం మైనార్టిల కోసం ఇంత చేసినముఖ్యమంత్రి మరెవరూ లేరని ఆకాశానికెత్తేశారు. ఏదో రాజకీయంగా చెప్పడం గాక సహజసిద్ధమైన నాటకీయ శైలిలో వూగిపోతూ పొగిడారు. కాంగ్రెస్ నాయకులు ఏదో అడ్డుతగలబోతే ఆగ్రహంగా స్పందించారు. అంతేగాక మేము ఉభయులం కలసి ఘన విజయం సాధిస్తామని ప్రకటించారు. ఆ సమయంలో కెసిఆర్ బల్లపై చరిచి సంతోషం వ్యక్తం చేయడం కనిపించింది. ఈ ప్రసంగం చూశాక నా వ్యాఖ్య పూర్తిగా సరైందని అర్థం కావడమే కాదు, మజ్లిస్ టిఆర్ఎస్ బంధం ఎంత దృఢమైందో తెలిసిపోయింది.