నాయకుల మధ్య ఆధిపత్య పోరు తెర వెనక ఉండాలి. అంతేగానీ, అందరికీ తెలిసేలా దాన్ని ఎవ్వరూ ప్రదర్శించరు! అసంతృప్తులు ఉండొచ్చు. ఉంటే దాన్ని అధినాయకత్వానికి ఫిర్యాదు చేసుకోవాలి. అంతేగానీ, ప్రెస్ మీట్లలో దాన్ని వెళ్లగక్కడం సరైంది కాదు కదా. తెలంగాణ కాంగ్రెస్ లో ఇలాంటి ప్రదర్శనలే ఎక్కువ. ఇవే ఐకమత్యాన్ని దెబ్బతీస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కూడా ఇలాంటి చర్చలకు చెక్ పెట్టాల్సింది పోయింది, సీనియర్లే ఈ చర్చలకు కారకులు అయితే ఎలా..?
పొన్నాల లక్ష్మయ్య, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి… ఈ ఇద్దరి మధ్యా అలకలూ చిలకలూ ఇంకా ఒక కొలీక్కి రాని పరిస్థితి తాజాగా కనిపించింది. గాంధీభవన్ లో కోర్ కమిటీ సమావేశం అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో… ఉత్తమ్ మాట్లాడుతూ, వేదిక మీదున్న పొన్నాల పేరు తప్ప, ఇతర నేతలందరి పేర్లు చెబుతూ ప్రసంగించారు. అప్పటికే ముఖం చిన్నబుచ్చుకుని కూర్చున్న పొన్నాల, ఉత్తమ్ ప్రసంగం అయిన వెంటనే మైక్ తీసుకుని… ఇక్కడ చాలామందికి తెలుసు, నా పేరు పొన్నాల లక్ష్మయ్య అంటూ సెటైర్ వేశారు. దాంతో ఉత్తమ్ అర్థం చేసుకుని.. సారీ అన్నా అనేశారు. ఆ తరువాత, మరోసారి ఫోన్ ద్వారా మెసేజ్ పెట్టారు. అయినాసరే ఉత్తమ్ తీరు మీద పొన్నాల అదే అసంతృప్తిని కొనసాగిస్తున్నారని టాక్.
నిజానికి, ఈ ఇద్దరి మధ్యా ఈ వాతావరణం ఇప్పటిది కాదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొన్నాల సీటును అందరికంటే ఆలస్యంగా ఉత్తమ్ ఖరారు చేశారు. తనకు సీటు ఆలస్యంగా ప్రకటించడం వల్లనే ఓడిపోయాను అనేది పొన్నాల అభిప్రాయం. మొన్నటికి మొన్న, గవర్నర్ కు వినతి ఇవ్వడానికి పొన్నాలతో సహా కాంగ్రెస్ కీలక నేతలు రాజ్ భవన్ కి వెళ్తే… తీరా అక్కడి వెళ్లాక పొన్నాలకు అపాయింట్మెంట్ లేదనీ, ఆయన పేరు ఇవ్వలేదంటూ తెలియడంతో అక్కడా ఆయనకి అసంతృప్తి కలిగిందట. తనకు ప్రాధాన్యత తగ్గించాలనే ఉత్తమ్ ఇలా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఆయనలో బలంగా ఉంది. ఆ అసంతృప్తిని వెళ్లగక్కే సందర్భం ఆయనకి రాలేదు. ఇప్పుడు ఛాన్స్ దొరికింది కదా అని ఉత్తమ్ మీద సెటైర్ వేసేశారు. త్వరలో ఏఐసీసీ కార్యదర్శులతోపాటు కొన్ని కీలక పదవుల నియామకం కాంగ్రెస్ హైకమాండ్ చేయనుంది. ఈ నేపథ్యంలో తన నిబద్ధతకు తగిన గుర్తింపు రావడం లేదన్న అసంతృప్తిని పొన్నాల వెళ్లగక్కుతున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే, ఇలా వ్యవహరిస్తే అధినాయకత్వం దృష్టిలో పడతారా..? కొపాన్ని తెలిపితే గుర్తింపు లభిస్తుందా..?