`వినయ విధేయ రామ`కీ `గ్యాంగ్ లీడర్`కీ కథ కథనాలు, కథానాయకుడి పాత్ర చిత్రణ విషయంలో కొన్ని సారుప్యాలున్నాయన్నది మెగా అభిమానుల నమ్మకం. ట్రైలర్ చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. గ్యాంగ్ లీడర్ అన్నాదమ్ముల కథ. అన్నయ్య మరణాన్ని తమ్ముడి దగ్గర దాచి పెడతారు. ఆ సంగతి తెలిశాక.. తమ్ముడు శత్రుసంహారం కోసం రంగంలోకి దిగుతాడు. అదే గ్యాంగ్ లీడర్ కథ. ఇక్కడా అంతే. వినమ విధేయ రామ కూడా అన్నదమ్ముల కథే. ప్రశాంత్ ని ప్రత్యర్థులు చంపేస్తే.. ఆ విషయాన్ని.. తమ్ముడు చరణ్ దగ్గర దాచి పెడతారు. అది తెలుసుకున్న తరవాత.. హీరో ఏం చేశాడన్నది వినయ వినయ విధేయ రామ కథ.
అయితే.. ఈ రెండు సినిమాలకూ పోలిక లేదని చరణ్ చెబుతున్నాడు. ”నాకు గ్యాంగ్ లీడర్ అంటే చాలా ఇష్టం. అలాంటి కథని చేద్దామనుకున్నా. కానీ.. వినయ విధేయ రామ అలాంటి కథ కాదు. సన్నివేశాలు, నేపథ్యం అంతా కొత్తగా ఉంటుంది. తెరపై చూశాక ఆ విషయం మీకే అర్థం అవుతుంది” అన్నాడు చరణ్. బోయపాటి సినిమాల్లో హింస, రక్తపాతం ఎక్కువగా ఉంటాయి. మరి ‘వినయ విధేయ రామ’ సంగతేంటి? అని అడిగితే. `బోయపాటి మార్కు సన్నివేశాలు ఉంటాయి. అయితే… హింస ఎక్కువగా ఏం ఉండదు. ఇంటిల్లిపాదీ చూసేలానే తీశాం. అందుకే ఒక్క కట్ కూడా లేకుండా యు బై ఏ సర్టిఫికెట్ వచ్చింది” అని చెప్పుకొచ్చాడు చరణ్.