త్రివిక్రమ్ పుస్తకాల పురుగు అన్న సంగతి తెలిసిందే. తనకి మధుబాబు అంటే చాలా ఇష్టం! మధుబాబు నవలలన్నీ చదివేశాడు. ఓసారి ఆయన్ని వెదుక్కుంటూ వెళ్లి కలిసి, మాట్లాడి వచ్చాడు. అప్పటి నుంచీ ఇద్దరి మధ్య స్నేహం కొనసాగుతూనే ఉంది. మధుబాబు ప్రభావం త్రివిక్రమ్ సినిమాలు తీసే స్టైల్లో తెలుస్తుంటుంది. ‘అతడు’లోని ఒకట్రెండు షాట్లు మధుబాబు నవలల నుంచి స్ఫూర్తి పొంది తీసినవే అని త్రివిక్రమ్ చెప్పాడు కూడా.
ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ కథ.. మధుబాబు నవల నుంచి స్ఫూర్తి పొందినదే అని బయట ప్రచారం జరుగుతోంది. దానిపై మధుబాబు కూడా స్పందించారు. ‘త్రివిక్రమ్ నన్ను కథ గురించేం అడగలేదు.. నా కథని ఏం సినిమాగా తీయడం లేదు’ అని క్లారిటీ ఇచ్చారు. అయితే….. ఎన్టీఆర్ సినిమాలో మధుబాబు నవలలకు సంబంధించిన లక్షణాలు కొన్ని కనిపిస్తాయని తెలుస్తోంది. మధుబాబు తన కథానాయకుడ్ని ఆవిష్కరించే విధానమే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు ఆపాదించాడట త్రివిక్రమ్. అంతేకాదు.. ‘అతడు’లో తెలిసీ తెలియకుండానే మధుబాబు నవలల నుంచి స్ఫూర్తి పొంది షాట్లు తీసినట్టు… ఈ సినిమాలోనూ.. కొన్ని చోట మధుబాబు నవలల స్ఫూర్తి కనిపిస్తుందట. ‘మీనా’లా ఇది పుస్తకాన్ని సినిమా తీయడం కాదు. జస్ట్.. మధుబాబులా ఆలోచించి – హీరో పాత్రని రాసుకోవడం. ఈ విషయాన్ని త్రివిక్రమ్ ఒప్పుకుంటాడా లేదా? అనేదే కాస్త ఆసక్తి కలిగించే విషయం. ‘మీనా ‘నవలలని సినిమాగా తీసినా… టైటిల్లో యద్దనపూడి పేరు చూపించిన త్రివిక్రమ్… కథానాయకుడి పాత్ర చిత్రణని స్ఫూర్తిగా తీసుకొంటే మాత్రం క్రెడిట్ ఇస్తాడా..? ఆ ఛాన్సే లేదు.