2024 మెగా ఫ్యాన్స్ కి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చింది. చిరంజీవి దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అవార్డ్ కు ఎంపిక కావడం ఫ్యాన్స్ లో గొప్ప ఆనందాన్ని నింపింది. మరోవైపు వశిష్ట దర్శకత్వంలో చిరు చేస్తున్న విశ్వంభర సినిమా పనులు కూడా చకచక సాగుతున్నాయి. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. రిలీజ్ డేట్ కూడా లాక్ అయ్యింది. జనవరి 10న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. రేపు అధికారకంగా ఈ డేట్ ప్రకటించనున్నారు. పండగకళతో ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భీమవరం దొరబాబుగా కనిపించబోతున్నారు చిరంజీవి. ఫాంటసీ టచ్ వుండే ఈ కథ ఎక్కువ భాగం గోదావరి ప్రాంతంలో జరగనుంది. సంక్రాంతికి వుండే హంగామా ఇందులో వుండేలా చూస్తున్నారు. ప్రస్తుతం యాక్షన్ సీన్స్ తీస్తున్నారు. వచ్చే సంక్రాంతికి చాలా సినిమాలు అప్పుడే లైన్ కట్టాయి. అయితే డేట్ తో సహా ప్రకటించే మొదటి సినిమా విశ్వంభరనే అవుతుంది.