గతేడాది కరోనా వల్ల కలిగిన నష్టాన్ని… ఈ యేడాది వడ్డీతో సహా వసూలు చేసుకోవాలని టాలీవుడ్ గట్టిగా ఫిక్సయ్యింది. గత రెండు నెలలుగా కొత్త సినిమాలు జోరుగా.. మొదలైపోయాయి. ఇప్పుడు రిలీజ్ డేట్లు ఫిక్సయిపోతున్నాయి. గంపగుత్తగా నిర్మాతలు రిలీజ్ డేట్లు ఎనౌన్స్ చేసేస్తున్నారు. 24 గంటల వ్యవధిలో దాదాపు అరడజను సినిమాలు రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకున్నాయి.
వరుణ్ తేజ్ సినిమా `గని` జులై 30 న రావడానికి సిద్ధమైంది. ఏప్రిల్ 2న గోపీచంద్ `సిటీమార్` విడుదల కానుంది. ఆగస్టు 13న `పుష్ష` వచ్చేస్తోంది. ఏప్రిల్ 30 న `విరాటపర్వం` విడుదలకు ఫిక్సయ్యింది. ఈ నాలుగు సినిమాల రిలీజ్ డేట్లు ఈ రోజే ఫిక్సయ్యాయి.
ఫిబ్రవరి నెలలో సినిమాలకు కొదవలేదు. 12న ఉప్పెన వస్తోంది. 19న నితిన్ తన సినిమాతో `చెక్` పెట్టబోతున్నాడు. 26న సందీప్ కిషన్ `ఏఎన్ ఎక్స్ప్రెస్`ని పట్టాల మీదకు తీసుకొస్తున్నాడు. శివరాత్రి సందర్భంగా మార్చి 13న థియేటర్లు కళకళలాడిపోనున్నాయి. ఆరోజు మూడు సినిమాలొస్తున్నాయి. శర్వానంద్ శ్రీకారం, శ్రీవిష్ణు గాలి సంపత్, నవీన్ పొలిశెట్టి జాతిరత్నాలు.. ఈ మూడూ శివరాత్రికే రిలీజ్.
మార్చి 26న నితిన్ రంగ్ దే, రానా అరణ్యలు రిలీజ్ అవ్వబోతున్నాయి. ఇక.. చావు కబురు చల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్… రిలీజ్ డేట్లు ఖాయం చేసుకోవాల్సివుంది. మార్చిలోనే.. వకీల్ సాబ్ కూడా రావొచ్చు. ఇక ఆచార్య రిలీజ్ డేట్ కూడా పక్కా అయిపోతే.. వేసవి వరకూ బెర్తులు ఖాయమైపోయినట్టే. ఒకటి మాత్రం పక్కా. ప్రతీ వారం కనీసం రెండు సినిమాలైనా థియేటర్లోకి వస్తాయి. ఈ సందడి వేసవి ముగిసే వరకూ కనిపించే ఛాన్సుంది. కాబట్టి.. టాలీవుడ్ కి ఇక నుంచి ప్రతీ వారం పండగే.