✍ తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ లో దళిత వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులకు అవమానాలు జరుగుతున్నాయా ?అగ్రవర్ణాలకు చెందిన కొందరు నాయకులు కావాలనే తమకు కించపరుస్తున్నారని కొందరు నాయకులు మదనపడుతున్నారా ? ఈ ప్రశ్నకు టీఆర్ఎస్ లోని కొందరు నాయకుల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. పెద్దపల్లి నుంచి టీఆర్ఎస్ ఎంపీగా ఉన్న బాల్క సుమన్ గతంలో ఉన్నతాధికారుల తీరుపై ఈ విషయంలోనే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రావు, రెడ్డి అని ఉంటూనే మాకు గౌరవం ఇస్తారా అంటూ సొంత పార్టీ నాయకుల ముందే అధికారులపై సీరియస్ అయ్యారు.
? తాజాగా కరీంనగర్ లో జరిగిన ఓ సమావేశంలో జిల్లా కలెక్టర్ పై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్రస్థాయిలో మండిపడటం చర్చనీయాంశంగా మారింది. ప్రోటోకాల్ ప్రకారం తమ ఫోటోలు ఫ్లెక్సీల్లో ఎందుకు లేవంటూ స్థానిక ఎమ్మెల్యే కమలాకర్ తో పాటు రసమయి కలెక్టర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి దత్తాత్రయే సహా రాష్ట్రమంత్రి ఈటెల రాజేందర్ ముందు కలెక్టర్ పై ఒంటికాలిపై లేచారు. అయితే అక్కడే ఉన్న ఇతర నాయకులు రసమయికు ఏదో రకంగా సర్దిచెప్పారు. అయితే కొందరు నాయకులు కావాలనే దళిత నాయకులను చిన్నచూపు చూస్తున్నారని టీఆర్ఎస్ లోని దళిత నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కొందరు నాయకులు నిర్ణయించుకున్నట్టు సమాచారం.