తెలుగుదేశం పార్టీ హయాంలో రేణిగుంట వద్ద ఎలక్ట్రానిక్ క్లస్టర్లో దాదాపుగా రూ. పదిహేను వేల కోట్ల పెట్టుబడితో జియో ఫోన్ల పరిశ్రమ పెట్టాలని రిలయన్స్ అనుకుంది. ఏపీ ప్రభుత్వం భూములు కేటాయించింది. రిలయన్స్ వాటి కోసం రూ. నాలుగు కోట్లు చెల్లించింది. ప్రభుత్వం మారిన తర్వాత మిగతా అన్ని పరిశ్రమల్లానే రిలయన్స్‌కు కూడా ప్రభుత్వం రెడ్ కార్డ్ వేసింది.అయితే రిలయన్స్ అదే సమయంలో రిలయన్స్ కూడా ప్రత్యామ్నాయం చూసుకుంది.. ప్రభుత్వం వద్దకు బతిమాలటకు రాలేదు. ప్రభుత్వం కూడా.. అంత పెద్ద పరిశ్రమ రాకపోతే తమకేం పోయిందని అనుకుంది.. రిలయన్స్ కు ఇచ్చిన స్థలాలను వెనక్కి తీసుకుని ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయడానికి మార్కింగ్ వేసింది.
అయితే ఇప్పుడు ఏపీకి ఏ వైపు నుంచి పెట్టుబడులు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఎలాగైనా ఓ పరిశ్రమను ఆకర్షించాలని ప్రయత్నిస్తున్న ఏపీ సర్కార్.. .మళ్లీ రిలయన్స్ వద్దకే రాయబారం పంపింది. తిరుపతి వద్ద గత ప్రభుత్వం కేటాయించిన భూములు న్యాయవివాదాల్లో ఉన్నాయని… ఈ సారి తాము పుత్తూరు వద్ద ఎలాంటి న్యాయవివాదాలు లేని భూములు ఇస్తామని ప్రతిపాదన పంపారు. ఆ ప్రతిపాదనను రిలయన్స్ పట్టించుకోలేదు కానీ.. భూముల కోసం తాము కట్టిన రూ. నాలుగు కోట్లు ఇవ్వాలని పట్టుబడుతోంది. దీంతో ప్రభుత్వం నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.
ఎలాగైనా రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను తీసుకు రావాలని పరిశ్రమల మంత్రి గౌతం రెడ్డి ప్రయత్నిస్తున్నారు. సీనియర్ అధికారులతో ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటు చేసి రిలయన్స్‌తో సంప్రదింపులకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొత్త పారిశ్రామిక విధానం ప్రకారం.. రాయితీలు కూడా తగ్గిపోవడం.. ఇప్పటికే రిలయన్స్ ప్రత్యామ్నాయం చూసుకోవడంతో ఇక్కడ పరిశ్రమ పెట్టే అవకాశం లేదన్న ప్రచారం మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో సాగుతోంది. గత ప్రభుత్వంలో వెల్లువలా వచ్చిన పరిశ్రమలు.. ఈ ప్రభుత్వంలో అదే వేగంతో వెనక్కిపోతున్నాయి. ఈ విషయం ఎఫ్‌డీఐల్లో స్పష్టమైంది. కరోనా ప్రభావం రాక ముందు ఏపీకి వచ్చిన ఎఫ్‌డీఐలు వెయ్యి కోట్లు మాత్రమే.