విశాఖలో రూ. 70వేల కోట్లతో పెట్టాలనుకున్న డేటా సెంటర్ పెట్టుబడుల నుంచి అదానీ గ్రూప్ వెనక్కి తగ్గిన .. రెండు, మూడు రోజుల్లోనే.. మరో భారీ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ నుంచి తరలి వెళ్లిపోయింది. తిరుపతిలో రిలయన్స్ పెట్టాలనుకున్న ఎలక్ట్రానిక్ సెజ్ నుంచి ఆ సంస్థ వైదొలిగింది. తాము పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా లేమని నేరుగా ప్రభుత్వం ముఖం మీదే చెప్పేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ భాగస్వామ్య సదస్సులో రిలయన్స్‌తో ఎంవోయూ చేసుకున్నారు. తర్వాత… చర్చల కోసం ముఖేష్ అంబానీ నేరుగా అమరావతి వచ్చారు. చంద్రబాబుతో మాట్లాడారు. ఆ తర్వాత ఒప్పందం చేసుకున్నారు. తిరుపతి విమానాశ్రయం సమీపంలో 150 ఎకరాల్లో ఈ సెజ్ ఏర్పాటుకు భూమిపూజ జరిగింది.
రిలయన్స్ ఎలక్ర్టానిక్స్ సిటీ కోసం ప్రభుత్వం 150 ఎకరాలు కేటాయించింది. ఇందులో రిలయన్స్ సంస్థ సుమారు రూ.15వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించారు. జియోఫోన్లు, సెట్‌టాప్ బాక్స్‌లతో పాటు రోజుకు దాదాపు పది లక్షల ఎలక్ట్రానిక్ వస్తువులు ఇక్కడ తయారయ్యే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ఒక్క సెజ్‌లోనే 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాల్సి ఉంది. ” తిరుపతిలో ఏర్పాటు చేయనున్న సెజ్‌లో ఏటా కోటి జియో సెల్ఫోన్లు తయారు చేస్తాం. జియో ఫోన్లు, చిప్ డిజైన్, బ్యాటరీలు, సెట్‌టాప్ బాక్స్‌ల వంటివన్నీ ఈ ఎలక్ట్రాట్రనిక్స్ పార్కులో తయారు చేస్తాం” అని అప్పట్లో ముఖేష్ అంబానీ స్వయంగా ప్రకటించారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత.. రిలయన్స్ .. ప్రాజెక్టును వదులుకోవడానికి సిద్ధపడింది.
ఈ ప్రాజెక్ట్ కోసం.. జగన్మోహన్ రెడ్డి సర్కార్ 75 ఎకరాల భూమి ఇచ్చింది. కనీ.. అవన్నీ వివాదాల్లో ఉన్నవే. కోర్టు కేసుల్లో పడ్డవే. ప్రభుత్వం తీరుపై రిలయన్స్ వర్గాలు తీవ్ర అసంతృప్తితో … పెట్టుబడులపై పునరాలోచన నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నాయి. గత ఐదు నెలల్లో కొత్త ప్రభుత్వం ఒక్కటంటే.. ఒక్క పరిశ్రమను తీసుకురాలేకపోయింది. కానీ గత ప్రభుత్వం తీవ్రంగా కష్టపడి తీసుకువచ్చిన ప్రాజెక్టుల్ని మాత్రం… రివర్స్ లో పంపేసే విషయంలో చాలా స్పీడ్ గా ఉంది. గత ప్రభుత్వంలో ఎంవోయూలు కుదుర్చుకుని.. భూమిపూజలు చేసుకున్న అనేక కంపెనీలు పెట్టుబడులుకు ముందుకు రావడం లేదని.. మంత్రి గౌతం రెడ్డి కూడా… చెబుతున్నారు.