ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు భారీ పరిశ్రమలు వస్తున్నాయి. రిలయన్స్ ఆస్తులు పంచుకున్న తర్వాత .. దివాలా స్థితికి చేరిన అనిల్ అంబానీ తన కుమారుల మేనేజ్మెంట్లో ఉన్న కంపెనీల కారణంగామెల్లగా కోలుకుంటున్నారు. అడాగ్ కింద ఉన్న కంపెనీల్లో రిలయన్స్ పవర్ ఇటీవల మంచి పనితీరు కనబరుస్తోంది. ఆ కంపెనీ తాజాగా విశాఖలో ఓ పరిశ్రమ పెట్టాలని నిర్ణయించుకుంది. సోలార్ ఎనర్జీకు పెరుగుతున్న డిమాండ్ ను బట్టి సోలార్ సెల్స్ తయారీని భారీగా చేపట్టాలని నిర్ణయించారు. అలాంటి పరిశ్రమ ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థలాలను అనిల్ అంబానీ పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖలోనూ ఆయన స్థల పరిశీలన చేశారు.
గ్రీన్ ఎనర్జీ రంగంలో రెండు రకాల పెట్టుబడులు ఉంటాయి. నేరుగా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు పెట్టేవారు.. అలాగే వాటికి అవసరమైన పరికరాలు తయారు చేసే పరిశ్రమలు. రెండు రకాల పరిశ్రమలకూ ఏపీ కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే గ్రీన్ ఎనర్జీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే వాటికి అవసరమైన వస్తువుల ఉత్పత్తి తయారీ పరిశ్రమలు కూడా రెడీ అవుతున్నాయి. అదే సమయంలో సోలార్ ఎనర్జీపై ప్రతి ఒక్కరిలో అవగాహన పెరుగుతోంది. ప్రభుత్వం కూడా ప్రోత్సహం ఇస్తోంది. కరెంట్ చార్జీల నుంచి ఉపశమనం పొందాలంటే.. ఇలాంటి సోలార్ ఎనర్జీ ఉత్పత్తిని ప్రతి ఇంట్లో చేసుకోవాలన్న సూచనలు వినిపిస్తున్నాయి.
ఇటీవల కుప్పం నియోజకవర్గంలో వంద శాతం ఎనర్జీగా మార్చే పనులను చంద్రబాబు ప్రారంభించారు. ప్రతి ఇంటిపై సోలారు సెల్స్ కనిపించనున్నాయి. కరెంట్ బిల్లు ఏ ఇంటికీ రాకుండా ఉండేలా ఈ ప్రయత్నం విజయవంతం అవుతుంది . సోలారు సెల్స్ ఉత్పత్తి స్థానికంగా జరిగితే తక్కువకు వస్తాయి. సోలారు ఎనర్జీలో ప్రజలు దేశంలో ఓ ట్రెండ్ సృష్టించే అవకాశం ఉంటుంది.