బంగాళా ఖాతంలో కృష్ణా గోదావరి బేసిన్ లో రిలయన్స్ సంస్ధ తన హద్దులను దాటి ప్రభుత్వ రంగసంస్ధ ఒఎన్ జిసి క్షేత్రాల్లోని గ్యాస్ తీసి అమ్ముకుందని ధృవపడింది. ఆరేళ్ళుగా సాగుతున్న ఈ” దొంగతనం” వల్ల ఒ ఎన్ జి సి 8 వేల బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ నష్టపోయిందని లెక్క తేలింది. ఈ గ్యాస్ విలువ 11 వేల కోట్లరూపాయలు.
కృష్ణాగోదావరి బేసిన సముద్ర గర్భంలో కొన్ని ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డులను రిలయన్స్ ఇండస్ట్రీస్ వేలం లో దక్కించుకుంది. వాటి హద్దుల్లోనే ఒఎన్ జిసి కి 8 ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డులు వున్నాయి. రిలయన్స్ సంస్ధ సరిహద్దు నియమ నిబంధనలను ఉద్దేశ్య పూర్వకంగా అతిక్రమించి గ్యాస్ ను వెలికితీయడం వల్ల ఓ ఎన్ జి సి కి చెందిన 5 ఫీల్డుల నుంచి గ్యాస్ పక్కనే వున్న రిలయెన్స్ బావుల్లోకి మరలిపోయిందని గుర్తించారు.
రిలయన్స్ లో చమురు ఇంధన వాయువుల అన్వేషణ ఉత్పత్తి విభాగాల్లో పనిచేస్తున్న ఉన్నత స్ధాయి నిపుణులు ఒకప్పుడు ఒఎన్ జిసి అధికారులే. ఇందువల్ల రిలయన్స్ కి గ్యాస్ తీసి అమ్ముకోవడమే తప్ప ఎక్కడుందో వెతుక్కోవలసిన పని లేకుండా పోయింది. “ఇదంతా పెద్ద వాళ్ళ వ్యవహారమం మనకెందుకులే అని మౌనంగా వుండిపోయినా కూడా ఓఎన్ జిసి క్షేత్రాల్లో గ్యాస్ ఎందుకు రావడం లేదో ఆడిట్ లో సంజాయిషీ ఇవ్వక తప్పదు కాబట్టే రిలయన్స్ సరిహద్దుల అతిక్రమణ గురించి ఒ ఎన్ జి సి రికార్డు చేయక తప్పలేదు’ అని ఆసంస్ధలో రిటైర్ అయిన ఉన్నత స్ధాయి జియాలజిస్ట్ ఒకరు చెప్పారు.
ఏమైతేనేమి రెండేళ్ళ క్రితం ఒఎన్ జిసి ఢిల్లీ హైకోర్టులో రిలయెన్స్ అతిక్రమణపై కేసు వేసింది. రెండు సంస్ధలకూ ఆమోదయోగ్యమైన మరో సంస్ధతో పరిలశీలన జరపాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రకారం అమెరికాలోని డల్లాస్ కు చెందిన డి అండ్ ఎం (డిగోయ్లర్ అండ్ మెక్నాటన్) సంస్ధ మధ్యవర్తిగా పరిశీలన జరిగింది. సంస్థ నివేదికలో రిలయన్స్ సరిహద్దు ఆక్రమణ వాస్తవమే వాస్తవమేనని నిర్ధారించారు.
ఒఎన్ జిసి గ్యాస్ ను రిలయన్స్ అమ్మేసుకుంది కనుక ఆమొత్తం 11 వేల కోట్ల రూపాయలు ఒఎన్ జిసి కి చేరాలి. ఇందుకు 6 నెలల గడువులో 2 నెలలు గడచిపోయాయి. తప్పు చేసినందుకు శిక్షలేదు. ఆడబ్బు అసలు యాజమాన్యానికి చెల్లిస్తే చాలట! ఇదికూడా నగదు రూపంగా కాక రిలయన్స్, ఒఎన్ జిసి సంస్ధలు కలిసి పనిచేసి వచ్చిన లాభాలనుంచి ఒఎన్ జిసి తన బాకీని చెల్లు బాటుచేసుకోవాలట! ఇది భారీ పెట్టుబడులతో ముందుకి వచ్చిన రిలయన్స్ సంస్ధకు ముందుగానే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఒప్పందం రూపంలో ఇచ్చిన సదుపాయం!
సూటిగా చెప్పాలంటే మేకకు పులి బాకీ పడిన మొత్తాన్ని పులీ మేకా కలసి పని చేసి సంపాదించి మేక రుణం పులి తీర్చాలన్నమాట! ఈ పరిష్కారాన్ని అమలు చేయడానికి నరేంద్రమోదీ ప్రభుత్వం సిద్ధమైపోయింది.
ప్రకృతి మానవాళికి కానుకగా ఇచ్చిన ఇంధన వాయువులో 11 వేలకోట్ల రూపాయల మేరకు గ్యాస్ ను రిలయన్స్ దోచుకుపోయిన విషయం రోడ్డున పడ్డాక కూడా సబ్సిడి రూపంలో అందుతున్న ప్రకృతి బహుమానాన్ని వదిలేసుకోమని ప్రజలను కోరడానికి ప్రధాని నరేంద్రమోదీ లోలోపలైనా ఇబ్బంది పడతారా?? ఏమో!!