కాలుష్యం కారణంగా చెబుతూ.. అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమల్ని మూసివేయాలని ఏపీ సర్కార్ ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ హైకోర్టు తోసి పుచ్చింది. జూన్ పదిహేడో తేదీ లోపు.. పీసీబీ సూచనలను అమలు చేయాలని ఆదేశించింది. పరిశ్రమలను యధావిధిగా నడుపుకోవచ్చని స్పష్టం చేసింది. నిన్న జువారి సిమెంట్ విషయంలో హైకోర్టు ఇలాంటి తీర్పుఇవ్వగా.., ఈ రోజు.. అమరరాజా విషయంలో… హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. కాలుష్య నిబంధనలు పాటించడం లేదంటూ.. అమరరాజా సంస్థతో పాటు.. జువారి సిమెంట్ పరిశ్రమల్ని మూసివేయాలని ఏపీ సర్కార్ ఆదేశించింది. కరెంట్ సరఫరా నిలిపివేసింది.
దీంతో ఆ రెండు పరిశ్రమలకు చెందినఇరవై వేల మంది ఉద్యోగులకు సెలవులు ప్రకటించారు. ఆ రెండు పరిశ్రమల మూసివేత వెనుక ఉన్న కారణం కాలుష్యం కాదని.. అంతకు మించిన కోణాలు ఉన్నాయని ఆరోపణలు ఇతర పార్టీల నుంచి వచ్చాయి. జువారీ పరిశ్రమ పక్కనే..భారతి సిమెంట్ పరిశ్రమ ఉంటుంది. పోటీగా ఉందని జువారీ సిమెంట్‌ను.. టీడీపీ ఎంపీకి చెందినది కాబట్టి అమరరాజా పరిశ్రమను టార్గెట్ చేశారని విమర్శలు వినిపించాయి. ముఫ్పై ఏళ్లుగా ప్రతీ ఏటా.. కాలుష్య నిబంధనలనుపక్కాగా అమలు చేస్తున్న రికార్డు ఉన్న అమరరాజాపై ప్రభుత్వం కాలుష్యం ఆరోపణలు చేయడం ఇండస్ట్రీ వర్గాలను సైతం విస్మయానికి గురి చేసింది.
ఈ తరుణంలో హైకోర్టు ఆదేశాలు ఆ సంస్థకు ఊరటనిచ్చాయి. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు తీసుకు రాకపోగా… ఉన్న పరిశ్రమల్ని భయభ్రాంతాలకు గురి చేసి… తరిమేస్తున్నారన్న ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అమర రాజాపై గతంలోనూ ఏపీ సర్కార్ ఇలాంటి వివాదాస్పద ఉత్తర్వులే ఇచ్చింది. భూముల్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా జీవో ఇచ్చింది. ఆ నిర్ణయాన్ని కూడా న్యాయస్థానం చట్ట విరుద్ధమని కొట్టివేసింది.