తెదేపా నేతలు, మంత్రులు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో బినామీ పేర్లతో వేల ఎకరాలను కొనుగోలు చేసారంటూ సాక్షి మీడియాలో వరుస కధనాలు ప్రచురించినందుకు, కొన్ని రోజుల క్రితం తెదేపా ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర పొన్నూరు పోలీస్ స్టేషన్ లో సాక్షి సంపాదకుడు, డైరెక్టర్లపై పిర్యాదు చేసారు. జగన్ కి చెందిన సాక్షి పత్రిక రాజకీయ దుర్దేశ్యంతోనే నిరాధారమయిన వార్తలు, కధనాలు ప్రచురించిందని, దాని వలన తమ పార్టీకి, ప్రభుత్వానికి చాలా అప్రదిష్ట కలిగిందని, కనుక వారిపై చర్యలు తీసుకోవలసిందిగా నరేంద్ర పోలీసులను కోరారు. ఆయన పిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
తక్షణమే సాక్షి డైరక్టర్లు హైకోర్టుని ఆశ్రయించారు. రాజధాని ప్రాంతంలో తెదేపా నేతలు, మంత్రులు బినామీల పేర్లతో భూములు కొన్నట్లు దృవీకరించుకొన్న తరువాతే ఆ వివరాలను పత్రికలో ప్రచురిస్తే, పోలీసులు అధికార పార్టీ నేతల రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి తమపై కేసులు పెట్టారని, కనుక తమపై ఎటువంటి తదుపరి చర్యలు చేపట్టకుండా పోలీసులను ఆదేశించాలని సాక్షి తరపున న్యాయవాది కోరారు. ఈ కేసుని విచారించిన జస్టిస్ సంజయ్ కుమార్ ఆయన అభ్యర్ధనను మన్నించి, సాక్షి డైరెక్టర్లపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పొన్నూరు పోలీసులకు నేడు ఆదేశాలు జారీ చేశారు.
ఒకవేళ హైకోర్టు సాక్షి అభ్యర్ధనను మన్నించకపోయుంటే, అది వైకాపాకి దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ అయ్యుండేది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో తెదేపాకు కొంచెం నిరుత్సాహం కలిగే ఉంటుంది.