నేషనల్ హెరాల్డ్ కేసు ఒక భారీ కుంభకోణంతో ముడిపడున్నది. అందులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి మరి కొంత మంది కాంగ్రెస్ ప్రముఖులు ముద్దాయిలుగా ఉన్నారు. ఆ కేసులో అందరూ కోర్టుకి పూచీకత్తు చెల్లించి బెయిల్ పై విడుదలయ్యారు. సామాన్య ప్రజలకే అటువంటి పరిస్థితి ఎదురయితే సమాజంలో తలెత్తుకొని తిరిగే పరిస్థితి ఉండదు. కానీ ఈ కేసులో ముద్దాయిలుగా బెయిల్ పై విడుదలయిన వారు అందరూ ఈ కేసును చాలా గొప్ప విషయంగా భావిస్తున్నారు. అందుకే వారు ఏమాత్రం సిగ్గు పడకకుండా ఆ కేసు పేరు చెప్పి పార్లమెంటు శీతాకాల సమావేశాలను స్తంభింపజేశారు. ఆ కేసును విచారిస్తున్న కోర్టు వరకు పాదయాత్రలు చేయాలనుకొన్నారు. ఆ కేసులో రాహుల్ గాంధి బెయిల్ తీసుకోకుండా జైలుకి వెళ్లాలని ఉవ్విళ్ళూరారు. ఆ కేసు పేరు చెప్పి డిల్లీలో పెద్ద హంగామా సృష్టించారు. తద్వారా దేశ ప్రజల దృష్టిని, సానుభూతిని ఆకర్షించాలని ప్రయత్నించారు. ఆ అవినీతి కేసుని కాస్తా ఏదో ఘనకార్యంలాగ చిత్రీకరించడంలో సఫలమయ్యారు.
ఆ కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఉన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధి, మోతీలాల్ ఓరా, ఫెర్నాండెజ్, సుమన్ దుబేలకు ప్రత్యేక కోర్టు వ్యక్తిగత హాజరు నుంచి నిన్న మినహాయింపునిచ్చింది లేకుంటే వారు ఆ కేసు పేరు చెప్పుకొని నిసిగ్గుగా ఇంకా ప్రచారం చేసుకొనే వారేమో. ఒక అవినీతి కేసులో ముద్దాయిలుగా ఉండి, బెయిల్ పై విడుదలయిన అటువంటి రాజకీయ నాయకులే ప్రజలకు, విద్యార్ధులకు, ప్రభుత్వానికి నీతి పాఠాలు వల్లించడం కేవలం భారత్ లోనే సాధ్యమేనేమో!