అదానిపై అమెరికాలో నమోదైన కేసులపై ఆవేశ పడిన వారందరికీ ఇప్పుడు ఆ దేశం నుంచి షాక్ లాంటి వార్త వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ అదానీపై ఉన్న కేసులను బలహీనపరిచేలా ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఆ ప్రకారం విదేశాల్లో అవినీతి వ్యవహారం, అమెరికాలో ప్రభావం ఉన్న కేసుల విచారణలు నిలిపివేసి.. కొత్త మార్గదర్శకాలు రెడీ చేయనున్నారు. అంటే తాత్కాలికంగా అయినా అదానీపై కేసుల విచారణలు అమెరికాలో ఆగిపోతాయి.
అదానిపై పెట్టిన కేసుల చట్టాల అమలు నిలిపివేత
ఇండియాలో లంచాలు ఇచ్చి.. వాటి ద్వారా అధిక ఒప్పందాలు చేసుకుని … వాటిని అమెరికాలో చూపించి పెట్టుబడులు పొందారనేది అమెరికాలో అదానిపై నమోదైన కేసు. అక్కడి స్టాక్ మార్కెట్ ను మోసం చేశారన్నది ప్రధానమైన ఆరోపణ. ఇండియాలో ఇండియాలో లంచాల కేసు కాదు. ఇక్కడి లంచాల కేసు ఇక్కడిదే. ఇక్కడ అలాంటి కేసు నమోదు కాలేదు. అమెరికాలో ఫారిన్ కరపక్షన్ ప్రాక్టిసెస్ యాక్ట్ కింద కేసు నమోదు అయింది. ఈ యాక్ట్ అమలును ట్రంప్ ఆపేస్తూ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ చట్టం కిందనే అదానిపై కేసులు నమోదయ్యాయి కాబట్టి.. ట్రంప్ ఉత్తర్వుల వల్ల ఆదాని కేసులు బలహీనపడటం ఖాయంగా కనిపిస్తోంది.
అమెరికాలో ఆదానిలపై విచారణ ఆగిపోయినట్లే
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ , ఇతర సీనియర్ అదానీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్‌లు భారత్ లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలకు లంచాలు ఇచ్చి అధిక ధరకు విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారు. ఇందు కోసం 265 మిలియన్ డాలర్లు లంచం ఇచ్చినట్లుగా తేల్చారు. అదే సమయంలో కంపెనీ భారీగా లాభాలు వస్తాయని చెప్పి అమెరికా కంపెనీల నుంచి పెట్టుబడిని సేకరించింది. ఇది అమెరికా ఫెడరల్ సెక్యూరిటీస్ చట్టం ప్రకారం మోసం అని గుర్తించి కేసులు పెట్టారు. అప్పటి ఏపీ సీఎంకు పెద్ద మొత్తంలో లంచాలు అందినట్లుగా ఎఫ్‌బీఐ తేల్చింది.
అమెరికా కోసమే అన్న ట్రంప్
ట్రంప్ చేసిన పని మంచా కాదా అన్న విషయం పక్కన పెడితే అదాని గ్రూపునకు ఇది మంచి విషయం అనుకోవచ్చు. అమెరికా కేసు వల్ల అదానీ గ్రూపు షేర్ వాల్యూ చాలా పడిపోయింది. ఇప్పుడు ఆయనకు గుడ్ న్యూస్ అందడం వల్ల మేలు జరిగే అవకాశం ఉంది. గతంలో హిండెన్ బెర్గ్ వల్ల కూడా ఆయన భారీగా నష్టపోయారు. ఆ సంస్థను కూడా మూసివేశారు. అయితే వేటీపైనా ఇండియాలో విచారణలు జరగలేదు. జరుగుతాయన్న నమ్మకం కూడా లేదు.