ఇన్సైడర్ ట్రేడింగ్ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో ఏపీ సర్కార్‌కు ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. గతంలో పెట్టిన కేసులన్నీ తేలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పిటిషన్లను ఉపసంహరించుకోవడం ప్రారంభించారు. తాజాగా మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ… సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ సర్కార్ ఉపసంహరించుకుంది. నాలుగు వారాల్లో ఆ పిటిషన్‌ను తేల్చాలని ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు దిశానిర్దేశం చేసింది.
అమరావతి భూముల విషయంలో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌తో పాటు మరికొంత మంది ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా భూములు కొనుగోలు చేసి భారీగా లబ్ది పొందారంటూ… ఏసీబీ కేసులు నమోదు చేసింది. రాజధాని ప్రాంతంలో ముందస్తు సమాచారంతో భూములు కొనుగోలు చేశారని ఏసీబీ అభియోగాలు మోపింది. ఏజీ హోదాలో ఉండి భూములు కొనుగోలు చేశాయడం నేరమని ఏసీబీ తేల్చింది. ఆధారాలు లేని ఆరోపణలు చేసి.. కేవలం మీడియాలో ప్రచారం చేసి.. పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని దమ్మాలపాటి కోర్టుకు వెళ్లడంతో.. కేసుపై స్టే ఇస్తూ హైకోర్టు గాగ్ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలపై గతేడాది నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గత విచారణలో సుప్రీంకోర్టులో విచారణ జరపాల్సిన అవసరం లేదని.. హైకోర్టులోనే తేల్చుకుంటామని.. పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.
దీంతో సుప్రీంకోర్టు పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇచ్చింది. అయితే దమ్మాలపాటిపై ఏసీబీ చేసింది. ఇన్ సైడర్ ఆరోపణలు కావడం.. అలాంటి నేరమేదీ జరగలేదని సుప్రీంకోర్టు తేల్చేయడంతో… ఈ కేసు నిలబడే అవకాశాలు లేవు. దీంతో ఏపీ ప్రభుత్వం కేసులు ఉపసంహరించుకుంటుందా..? లేక మళ్లీ ఇన్ సైడర్ ఆరోపణలు కొనసాగిస్తుందా..అనేది ఆసక్తికరంగా మారింది.