డిప్యూటేషన్‌పై ఏపీలో పని చేస్తున్న ఇండియన్ రెవిన్యూ సర్వీస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌పై ఏపీ సర్కార్ విధించిన సస్పెన్షన్ వేటుపై.. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ క్యాట్ స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సర్కార్‌లో ఆయన పని ఈడీబీ శాఖలో ఉద్దేశపూర్వక నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ.. నివేదిక వచ్చిందన్న కారణం చెబుతూ… ఏపీ సర్కార్ సస్పెన్షన్ వేటు వేసింది. దీనిపై ఆయన క్యాట్‌లో పిటిషన్ వేశారు. క్యాట్‌లో కృష్ణకిషోర్ పిటిషన్ వేశారని తెలుసుకున్న ప్రభుత్వం… ఆదివారం రోజు.. ఆయనపై కేసు నమోదు చేసింది. ఆదివారం రాత్రి 10 గంటలకు కృష్ణకిషోర్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది.
ఆదివారం రాత్రి రా.9.30కి కృష్ణకిషోర్‌పై ఈడీబీ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ తులసిరాణి ఫిర్యాదు చేశారు. రా.11 గంటలకు ఎఫ్ఐఆర్ను కోర్టుకు పంపినట్లు సీఐడీ ప్రకటించింది. రాత్రి పూట సీఐడీ కేసు నమోదు చేయడంపై అధికారుల కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జీవో నెంబర్ 124కు విరుద్ధంగా అడ్వటైజ్ మెంట్లను సంబంధిత శాఖ నుంచి కాకుండా నేరుగా ఇవ్వటమే ప్రధానమైన ఉల్లంఘనగా ప్రభుత్వం చెబుతోంది. ఈ మాత్రం దానికే.. కేంద్ర సర్వీసు అధికారిని రాష్ట్రం సస్పెండ్ చేయడం.. ఏమిటన్న చర్చ సహజంగానే ఢిల్లీ స్థాయిలో జరుగుతోంది. క్రిష్ణకిషోర్ తోపాటు ఎకౌంట్స్ అధికారి బి.శ్రీనివాసరావు అనే మరో ఉద్యోగిపై కూడా కేసు నమోదు చేశారు.
సీఐడీ విభాగంతోపాటు ఏసీబీని కూడా ఈ కేసును పరిశీలించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. అయితే హడావుడిగా కేసు నమోదు చేయడానికి కారణం.. ఆయనను.. కేంద్రం..మళ్లీ సర్వీసులోకి తీసుకుంటుందన్న ఉద్దేశంతోనేనని.. అలా చేయకుండా ఉండటానికి… కేసు నమోదు చేశారని అంటున్నారు. ఈ వ్యవహారం.. పెద్ద దుమారం రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి.