ఏపీ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే , వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఊరట లభించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వంశీ హైకోర్టును ఆశ్రయించగా.. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం వంశీపై తొందరపాటు చర్యలు చేపట్టవద్దని పోలీసులను ఆదేశించింది.ఈ విషయంపై కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి పద్దెనిమిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..ఈ కేసులో 71వ నిందితుడిగా ఉన్న వంశీని కూడా అరెస్ట్ చేసేందుకు వేట ప్రారంభించారు. ఆయన మాత్రం పోలిసుల కళ్ళు గప్పి అజ్ఞాతంలోకి వెళ్ళారు.
ఈ కేసులో తనను ఎలాగైనా అరెస్ట్ చేస్తారని భయంతో ఎన్నికల తర్వాత వంశీ గన్నవరంకు రావడమే మానేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన పూర్తిగా హైదరాబాద్ కే పరిమితయ్యారు. ఇటీవల కృష్ణా జిల్లాకు నూతన ఎస్పీ రావడంతో ఈ కేసులో వేగం పెంచారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు ఆ మధ్య మూడు బృందాలు హైదరాబాద్ బయల్దేరగా. ఆయన ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు.
ఈ నేపథ్యంలోనే వంశీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 20వరకు వంశీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.