కర్ణాటక అంటే ఐటీ.. ఐటీ అంటే కర్ణాటక అనే పరిస్థితి నుంచి ఇప్పుడు సీన్ మారిపోతోంది. కర్ణాటక అంటే హలాల్, హిజాబ్, ముస్లిం వ్యాపారుల నిషేధం వంటివి గుర్తొస్తున్నాయి. ఒక దాని తర్వాత ఒకటి అలా జరుగుతూ పోతున్నాయి. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది. మరోసారి నిలబెట్టుకోవాలనుకుంటోంది. అలా చేయాలంటే.. తాము అధికారంలో ఉండి ప్రజలకు ఏం మేలు చేశామో చెప్పుకోవాలి. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. బీజేపీ నేతలే పోటీ పడి వివాదాల్ని సృ,్టిస్తున్నారు.
జనవరిలో హిజాబ్ వివాదం ప్రారంభమైన దగ్గర నుంచి ఓవర్గాన్ని టార్గెట్ చేసి ఏదో ఓ ప్రకటన చేస్తూనే ఉన్నారు బీజేపీ నేతలు. ఇవి వివాదాలుగా మారి ఘర్షణలకు దారితీస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఈ తరహా చర్యలు చేపట్టింది. ఇటీవల కొందరు హిందూ ఆలయ పరిసరాల్లో వ్యాపారం చేయడానికి ముస్లింలకు అనుమతి లేదని కొంత మంది బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దీన్ని కర్ణాటక సర్కారు సమర్థించింది. తర్వాత హలాల్ మాంసాన్ని కొనొద్దని.. ప్రచారం చేశారు. హలాల్ సర్టిఫికేషన్ ఉన్న కంపెనీలకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు. అలాగే ఇటీవల మసీదుల్లో లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించాలనే ఉద్యమాన్ని ప్రారంభించారు. ధ్వని కాలు ష్యం సాకుతో బెంగళూరులోని పలు మసీదుల్లోని మైకుల్ని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
పిచ్చి మరీ పరాకాష్టకు చేరిందనేదానికి సంకేతాలు కూడా వస్తున్నాయి. ముస్లిం వ్యాపారుల నుంచి పండ్లు కొనడాన్ని బహిష్కరించాలంటూ హిందూత్వ సంస్థ లు పిలుపునిచ్చాయి. కష్టపడేది హిందూ రైతులు అయితే, మధ్యలో ముస్లిం వ్యాపారులు లబ్ధి పొందుతున్నారని ఆరోపించాయి. తాజాగా ముస్లిం లు డ్రైవర్లు, ఓనర్లుగా ఉన్న కార్లు, వాహనాల్లో హిందువులు ఆలయాలను సందర్శించవద్దని భారతీయ రక్షణ వేదిక పిలుపునిచ్చింది. హిందువులు నడిపే వాహనాల్లోనే ప్రయాణించాలని సూచించింది.
ఇలాంటి విభజన వాదాలతో బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారు. వారి లక్ష్యం కర్ణాటకలో మరోసారి అధికారం సాధించడమే. కానీ ఇలా చేసి సాధించే అధికారం వల్ల ప్రజలకు మేలు చేస్తున్నారా కీడు చేస్తున్నారా అన్నది వారే తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఇంకా పూర్తి స్థాయిలో చైతన్యవంతులు కాలేదు మరి !