లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ ని ఉప్పర్ పల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఆ తరవాత జానీ మాస్టర్ ని చంచల్ గూడా జైలుకు తరలించారు. అక్టోబరు 3 వరకూ ఈ రిమాండ్ కొనసాతుంది. మరోవైపు రిమాండ్ రిపోర్ట్ లోని కొన్ని కీలకమైన అంశాలు బయటకు వచ్చాయి. జానీ మాస్టర్ తన నేరాన్ని అంగీకరించాడని, 2020 నుంచి బాధితురాలిపై అత్యాచారం చేశాడని ఒప్పుకొన్నాడని, తొలిసారి లైంగిక దాడి చేసినప్పుడు బాధితురాలు మైనర్ అని జానీ మాస్టర్ అంగీకరించాడని రిమాండ్ రిపోర్ట్ లో తేలింది. గత నాలుగేళ్లలో బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడని, ఈ విషయం బయటకు వస్తే, అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు ప్రస్తావించారు. దురుద్దేశంతోనే బాధితురాలిని తన దగ్గర జానీ మాస్టర్ సహాయకురాలిగా చేర్చుకొన్నాడన్న విషయాన్ని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో నమోదు చేశారు.
మరోవైపు జానీ మాస్టర్ బెయిల్ కోసం ఆయన తరపున న్యాయవాది ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ కేసు ఫోక్సో యాక్ట్ లో ఉన్నందున జిల్లా కోర్టులో పిటీషన్ దాఖలు చేస్తామని న్యాయవాది తెలిపారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, కోర్టులో న్యాయం దొరుకుతుందని నమ్ముతున్నానని జానీ మాస్టర్ సతీమణి సుమలత ఆశాభావం వ్యక్తం చేశారు.