‘శబ్దభేది’అనే ఒక విద్య వుంది. ఈ విద్య తెలిసినవారు..శబ్దం వినిపించిన వైపునకు గురి చూసి బాణాన్ని ప్రయోగించగలరు. ఈ విద్య రామాయణంలో దశరథునికి తెలుసు. అచ్చు అలాంటి విద్యనే పుణికిపుచ్చుకున్న కవి వేటూరి సుందరరామ్మూర్తి. దశరథుడు శబ్దం వైపునకు గురి చూసి బాణం వేయగలిగితే.. వేటూరి శబ్దానికి సరిపడా పదాన్ని ఆశువుగా ప్రయోగించగలరు. వేటూరిని తొందరరామ్మూర్తి అని కూడా సరదాగా పిలిస్తారు. కారణం ఆయనకి తెలిసిన ‘శబ్దభేది’ విద్యనే. సౌండ్ వినిపించిన వెంటనే అంత వేగంగా పదాన్ని ప్రయోగించి పాటని పూర్తి చేస్తారు. ‘అన్నులమిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే.. తొలిసిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే” ఈ పదాలలోని శబ్ద సౌందర్యాన్ని విని ఇళయరాజా ఎంత మురిసిపోయరో అనేక వేదికలపై ఆయన స్వయంగా చెబుతుంటారు.
తెలుగు సినిమా పాట చాలా మంది గొప్ప కవుల్ని చూసింది. కానీ ఇందులో వేటూరి చాలా ప్రత్యేకం. ఆయన లిరికల్ చాట్ జీపీటీ. సన్నివేశం, ట్యూన్ వినిపించిన వెంటనే పాట రెడీ అయిపోతుంది. ఆయనకున్న పద సంపద, వ్యాకరణం, ముఖ్యంగా శబ్దాలంకారంపై ఆయన సాధించిన పట్టు అమోఘం. ఎన్నో సందర్భాల్లో ఆయన చుట్టూ అసిస్టెంట్ డైరెక్టర్లు పాటలు రాసుకోవటానికి ఆశగా కూర్చునివుంటే ఒక చెట్టు కింద కూర్చొని ఒక్కొకరికి మంచి నీళ్ళు ఇచ్చినంత సులువుగా పాట రాసి ఇచ్చేసేవారు. అయితే ఇలా ఒకసారి రాసిచ్చే క్రమంలో ఒక గమ్మత్తయిన, మర్చిపోలేని ఓ సంఘటన చోటు చేసుకుంది.
ఆ సంఘటన గురించి ఓ సందర్భంలో పంచుకున్నారు వేటూరి. ఆ సంఘటన గురించి వేటూరి మాటల్లోనే…
ఒకసారి ఇద్దరు సంగీత దర్శకులకు ఏకకాలంలో పాటలు రాయాల్సి వచ్చింది. రెండూ డిఫరెంట్ సాంగ్స్. ఈ డ్యూయెట్లు వచ్చిన తర్వాత టూన్స్కి రాయడం మొదలయింది. బాగా బిజీగా ఉండటంతో హడావిడిలో పొరపాటున ఒకరికి ఇవ్వాల్సిన పాటను మరొకరికి ఇచ్చి పంపేశాను. అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా తొందరలో చూడకుండా పాటల కాగితాలను తీసుకువెళ్లిపోయారు. ఒకటి జెమినీ రికార్డింగ్ థియేటర్లో, మరొకటి విజయాగార్డెన్స్ లో రికార్డింగ్ జరుగుతోంది. పాట రికార్డ్ చేసే సమయానికి మొదట జెమినీకి వెళ్లాను. అక్కడ వేరేపాట వినబడుతుండేసరికి ‘ఇదేమిటీ.. ఈ పాట ఇక్కడ వినబడుతోంది. దీన్ని వేరేవాళ్లకోసం. రాశాను కదా’ అని అనుమానం వచ్చింది. ఆ పాట ట్యూన్ కాకుండా వేరే ట్యూన్లో వినబడుతుండేసరికి కంగారుపుట్టి లోపలికి వెళ్లాను. సంగీత దర్శకుడిని పక్కకు పిలిచి- ‘అయ్యా.. చిన్న. పొరపాటు జరిగిపోయింది. ఈ పాట మీకు రాసిందికాదు, వేరేవాళ్లకు రాసిన పాట మీకు వచ్చింది. ఇది “మీ ట్యూన్ కి సరిపోయిందా?” అనడిగాను. “సరిపోయింది కానీ మీరిప్పుడు లేనిపోనివి పెట్టకండి. ఫైనల్ టేక్ కూడా వచ్చింది. సింగర్ మళ్లీ దొరకదు. నా దుంప తెగుతుంది” అని అతను బతిమాలాడు. ‘ఇదేమిటిరా బాబు’ అనుకున్ననాను. దీనినిబట్టి తెలిసిందేమిటంటే డ్యూయెట్లకు యోగ్యత, సమయం, సందర్భం చూడటంలేదు. స్కేల్ పెట్టి కొలవడం, ట్యూన్ సరిపోవడమే ఈ యుగళగీతం యోగ్యత అయింది. ఈ పాత్రలు ఈ పాట పాడదగునా, ఈ సన్నివేశానికి ఈ పాటలో వాడిన మాటలు సరిపోతాయా? అనేటువంటివి చూసుకోవడం పోయింది అనేదానికి ఇదొక నిదర్శనం” అనుకున్నారు వేటూరి.
-నేడు వేటూరి జయంతి