పాపం… టాలీవుడ్ లో ఓ హీరో పరిస్థితి చూస్తే జాలేస్తోంది. ఎలాంటి అండ దండ లేకుండా సినిమాల్లోకి వచ్చి, స్టార్ గా ఎదిగిన హీరో అతను. పారితోషికం మెల్లమెల్లగా పెరుగుతూ, ఇప్పుడు పాతిక కోట్లకు చేరింది. అయితే పేరుకే పాతిక కోట్లు. కానీ అంతా ఎగ్గొట్టేవారే. తన గత నాలుగు చిత్రాల్లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. దానికి కారణం.. ఓటీటీ మార్కెట్ దారుణంగా పడిపోవడమే.
పారితోషికం విషయంలో హీరోలు కాస్త నిక్కచ్చిగా ఉంటుంటారు. పారితోషికం తగ్గిస్తే – తమ క్రేజ్ పడిపోయిందని నిర్మాతలు అనుకొంటారేమో అనే భయం వాళ్లది. ఆ హీరో కూడా అంతే. సినిమా సినిమాకీ పారితోషికం పెంచుకొంటూ వెళ్లాడు. తన మార్కెట్ కూడా అలానే పెరిగింది. అందుకే అడిగినంత ఇచ్చారు. 2023లో తన పారితోషికం రూ.10 కోట్లే. 2024లో డబుల్ అయ్యింది. ఇప్పుడు 25 కి తగ్గడం లేదు. అయితే నిర్మాతలు అడిగినంత ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. అడ్వాన్సుగా రూ.10 నుంచి రూ.12 కోట్లు ఇస్తున్నారు. ‘ఓటీటీ, శాటిలైట్ అయ్యాక మిగిలినవి ఇస్తాం’ అన్నది ప్రతిపాదన. అయితే సినిమా కాస్త అటూ ఇటూ అవ్వడం, ఓటీటీల మార్కెట్ కూడా డల్ అవ్వడం వల్ల ‘నాన్ థియేట్రికల్ వల్ల ఏం రాలేదు’ అంటూ మిగిలిన పారితోషికాన్ని ఎగ్గొడుతున్నారు. సినిమా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాని ఆ హీరో.. నిర్మాణ దశలో నిర్మాతల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక.. మిగిలిన మొత్తం కోసం సినిమా చివరి వరకూ ఎదురు చూస్తున్నాడు. అయితే చివర్లో నిర్మాతలు చేతులెత్తేయడం వల్ల కేవలం అడ్వాన్సులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. రూ.15 కోట్ల పారితోషికం అడిగినప్పుడు.. మొత్తం వచ్చేసేది. ఇప్పుడు పాతిక కోట్లు పెరిగిన తరవాత.. రూ.10 లేదా రూ.12తో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అదే మ్యాజిక్. అందుకే ఇప్పుడు తన పారితోషికానికీ నాన్ థియేట్రికల్ రైట్స్‌కి లింకు పెట్టుకోకూడదన్న నిర్ణయానికి వచ్చేశాడట.