రాజమండ్రి: రాజమండ్రి నగరం పేరును రాజమహేంద్రవరంగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. 12 రోజుల పుష్కరాల ముగింపు సందర్భంగా ఆర్ట్స్ కాలేజి ప్రాంగణంలో ఏర్పాటయిన సభలో రాత్రి తొమ్మిదింబావుకు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పుష్కరాలు ముగిసిన సందర్భంగా ఈ నగరానికి ఏదో ఒకపెద్ద ప్రాజెక్టుని వరంగా ముఖ్యమంత్రి ప్రకటిస్తారని రాజకీయవర్గాలు అంచనా వేశాయి. ఒక పెద్ద ఈవెంటు అయ్యాక ఆప్రాంతానికి ఏదో మేలు చేయడం ప్రభుత్వాల సాంప్రదాయమే! అది కోట్లరూపాయల్లో వుండే ప్రాజెక్టుగా కాక ఒక కల్చరల్ ఎమోషన్ గా ఈ ప్రాంతాన్ని ప్రపంచం ముందుంచడం చంద్రబాబులో ఇంతకు ముందు లేని కోణాన్ని చూపిస్తోంది.
తెలుగుని ఆదరించి మనకు అందించిన పుణ్యానికే రాజరాజనరేంద్రుని వెయ్యో సంవత్సర పట్టభిషేక ఉత్సవాన్ని 2011 ఆగస్టు 22 న రాజమండ్రిలో నిర్వహించారు.ఆరోజు గౌతమీ గ్రంధాలయం నుంచి పుష్కరాలరేవు వరకూ మహాభారతాన్ని పల్లకీలో ఊరేగించారు. అది ప్రభుత్వానిక పట్టని పేలవమైన ప్రదర్శన. నిర్వాహకులైన ఆంధ్రకేసరి యువజన సమితికి తప్ప ఎవరికీ పట్టని పండగ. మరుసటిరోజు దినపత్రికలలో స్లిప్ పేజీల కే పరిమితమైన ఆరు లైన్ల వార్తా విశేషం. తెలుగు సరిగారాని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో భాషాసంస్కృతుల ఇంతకుమించి ఇంకేమివుంటాయని పెద్దలు పెదవి విరిచిన సందర్భం.
రాజరాజనరేంద్రుడు వీరుడుకాదు శూరుడుకాదు సాహసికాదు. పరాక్రమవంతుడుకాదు. ఆయన ఏ యుద్ధంలోనూ గెలవలేదు. క్రమక్రమంగా రాజ్యంలో భాగాలను పోగొట్టుకున్నవాడు. అయితే తెలుగు భాషాభిమానమే రాజరాజనరేంద్రుని చిరంజీవిగా మన ముందుంచింది. తెలుగుభాషాపరంగా ఏదైనా చేయాలనుకున్న ఈ రాజుగారు తన క్లాస్ మేట్ నారాయణ భట్టు ని ఆపని చేయమన్నాడు. కన్నడ పండితుడైన భట్టు ఆ పనికి నన్నయభట్టు ని సూచించాడు. ఆవిధంగారాజరాజమహేంద్రుని కొలువులో నన్నయ చేరారు . రాజు కుటుంబ పురోహితునిగా కూడా నన్నయ వుండేవారు. నన్నయ రాసిన మొదటి గ్రంధం తెనుగు వ్యాకరణం. అందులో 90 పాళ్ళు సంస్కృతంలోనే వుండటం నన్నయకే నచ్చలేదట. అప్పుడు భారతాన్ని తెనిగిస్తాననడం రాజు ఒప్పుకోవడం జరిగాయి.
మూడుభాగాలుగా తెలుగుభారతం రాసిన కవిత్రయం లో చివరివాడైన ఎర్రాప్రగ్గడ 200 ఏళ్ళ తరువాత , అప్పటికే మరణించిన రాజరాజ నరేంద్రునికే తాను అనువదించిన భాగాన్ని అంకితం ఇచ్చారంటే ఆ పనిని ప్రోత్సహించిన రాజరాజనరెంద్రుని ప్రభావం ఎంతగా వుందో అర్ధం చేసుకోవచ్చు. మొదటిసారి 1924 ఆగస్టు 17 న రాజమండ్రి లో రాజరాజనరేంద్రుని 900 వ సంవత్సర పట్టాబిషేక మహోత్సవం జరిగింది.చరిత్రకారుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు ఆ తేదీని నిర్ధారించడమే కాక స్వయంగా ఆ వేడుకలో పాల్గున్నారు. తరువాత ఇప్పుడు రాజమంద్రిలో ఆంధ్రకేసరి యువజన సమితి , కళాగౌతమి సంస్థ విడి విడిగా వేడుకలు జరుపుతున్నాయి. యువజనసమితి లెక్క ప్రకారం ఆగస్టు 22న, కళాగౌతమి లెక్క ప్రకారం ఆగస్టు 17 న రాజరాజనరేంద్రునికి పట్టాభిషేకం జరింగింది. ఐదురోజుల తేడా పెద్ద వివాదం కాదు.
ఒక రాజు వెయ్యేళ్ల తరువాత కుడా గుర్తుండటమే విశేషం.కేవలం తెలుగుని ఆదరించి ప్రోత్సహించినందుకే రాజరాజనరేంద్రుడు వెయ్యెళ్ళుగా సజీవంగా వున్నారు. రాజకీయాలకు, పరిపాలనకు ప్రొఫెషనలిజాన్ని ఆపాదించిన ఆధునీకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి చరిత్ర సంస్కృతులపై ఉద్వేగాన్ని సహజంగానే ఎవరూ ఆశించరు. పుష్కరాలకాలమంతా రాజమండ్రిలోనే వుండి గోదావరి నీళ్ళుతాగిన ప్రభావమో ఏమోకాని చంద్రబాబు ఈ ఉదయం రాజరాజనరేంద్రుని విగ్రహానికి పూలదండవేశారు. ప్రగతిపధంలో భాషావికాసాల పాత్రను ప్రస్తుతించారు. నన్నయతో తెలుగు భారతాన్ని రచింపచేసిన రాజరాజనరేంద్రుని శ్లాఘించారు. అంకెలులేని చంద్రబాబు ఉపన్యాసం వుండదు. ఈ ప్రసంగంలో వినిపించిన ఉద్వేగపు జీర ఆయన రాజమహేంద్ర వరంతో బాగా కనెక్ట్ అయ్యారనిపించింది.
రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మారిస్తే ఎలావుంటుందని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని నిన్ననే అర్ధమైంది. గోదావరి అఖండంగా వున్న పట్టిసీమ నుంచి ఏడుపాయలై సముద్రంలో కలిసే ముఖద్వారాల వరకూ నీరు, పచ్చతనాలతో కళకళలాడే ప్రాంతమంతా రాజమండ్రి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ హబ్ గా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు.
గోదావరి పుష్కరాల ముగింపు హారతికి వెళ్ళేముందు ముఖ్యమంత్రి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నగరపౌరప్రముఖులతో ఇష్టాగోష్టిగా సమావేశమయ్యారు. టూరిజం ప్రాజెక్టుకి అఖండగోదావరి ప్రాజెక్టుగా, రాజమండ్రికి రాజమహేంద్రవరం గా పేరు పెడితే ఎలావుంటుంది? అని అడిగారు. అందరూ బాగుంటుంది మార్చండి అన్నారు.