ప్రార్థించే పెదవులూ, ట్వీట్లు చేసే వేళ్లూ కాదు కావల్సింది. సాయం చేసే చేతులే కావాలి. ఆ సాయం చిన్నదో, పెద్దదో. డబ్బు రూపంలోనో, మరో రూపంలోనో అన్నది అనవసరం. చేతనైనంత సాయం చేయాలి. కరోనా, లాక్ డౌన్లతో అల్లాడిపోతున్నవాళ్లందరికీ ఓ ధైర్యం, భరోసా అందివ్వాలి. రేణూదేశాయ్ ఇదే చేస్తోంది.
సోషల్ మీడియాలో రేణూ చురుగ్గా ఉంటోంది. ట్విట్టర్, ఇన్స్ట్రాలో రేణూకి ఫాలోవర్స్ బాగానే ఉన్నారు. తన ఫాలోయింగ్ ని కరోనా రోగుల సహాయార్థం వాడుకుంటోంది రేణూ. రేణూ ఇప్పుడు ఓ చిన్న టీమ్ ని ఏర్పాటు చేసింది. పొద్దుట లేచిన దగ్గర్నుంచి, రాత్రి పడుకునే వరకూ రేణూ చేసే పని ఒకటే. తన టీమ్ తో టచ్లో ఉండడం. ఎక్కడెక్కడ ఆక్సిజన్ సిలెండర్లు అందుబాటులో ఉన్నాయి? అవి ఎవరికి అవసరం? వాటిని ఎలా పేషెంట్ దగ్గరకు ఎలా చేర్చాలి? ఆసుపత్రిలో బెడ్ దొరక్క అల్లాడుతున్నవాళ్లకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలి…? ఇవన్నీ ఫోన్ ద్వారానే చేసేస్తోంది రేణే. అందుకోసంరోజుకి 18 గంటలు పనిచేయాల్సివస్తోందట. “నేను చేస్తోంది ఎలాంటి సహాయమో నాకు తెలీదు. జస్ట్.. ఫోన్లో సంధాన కర్తగా పనిచేస్తున్నాను. నాకు రోజూ వందలాది మెసేజీలు వస్తున్నాయి. వీలైనంత వరకూ ప్రతీ మెసేజ్కీ సమాధానం ఇస్తున్నాను. ఆక్సిజన్ సిలెండర్లు కావాలని కొంతమంది, ఆసుపత్రిలో బెడ్లు దొరకడం లేదని కొంతమంది, ఫుడ్ లేదని కొంతమంది.. ఇలా ఎవరి సమస్యలు వాళ్లు చెప్పుకుంటున్నారు. అవన్నీ నా టీమ్ కి పంపుతున్నాను. వాళ్లేమో… ఆ సమాచారాన్ని క్రోడీకరించి, ఎవరికి ఎలాంటి సహాయం కావాలో.. అందిస్తున్నారు. ఈ విషయంలో నాకు దాతలు సహయం చేస్తున్నారు. ప్రతీ రోజూ ఒకరికైనా సహాయం అందివ్వగలిగితే చాలు అనిపిస్తోంది“ అని భావోద్వేగ భరితంగా చెబుతోంది రేణూ.