తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సీనియర్ల అలకల పర్వం కొనసాగుతోంది! ఇన్నాళ్లూ లోలోపల మథనపడ్డ సీనియర్లంతా ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. పార్టీ నాయకత్వంపై అసంతృప్తి బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. పార్టీ సమావేశాల్లోనే ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే క్రమంలో చాన్నాళ్ల తరువాత వార్తల్లోకి వచ్చారు కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి. నిజానికి, ఆమె కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ నేతగా ఒకప్పుడు పేరు పొందారు. కానీ, గత కొన్నాళ్లుగా ఆమె పార్టీకి సంబంధించిన కీలక సమావేశాల్లోగానీ, కార్యక్రమాల్లోగానీ పెద్దగా కనిపించడం లేదు. దీనికి కారణం తాను క్రియాశీలంగా లేకపోవడం కాదనీ, పార్టీలో కొందరు కావాలనే తనని పక్కన పెడుతున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతల సమావేశం జరిగింది. దీన్లో అభ్యర్థుల ఎంపిక ఎలా చెయ్యాలి, కామన్ మేనిఫెస్టో రూపొందిస్తే ఎలా ఉంటుందీ, ఇలాంటి కొన్ని ప్రతిపాదనల మీద చర్చ జరిగింది. ఇదే సందర్భంలో రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తాను ఉన్నాననీ, కాంగ్రెస్ కి కట్టుబడి తన స్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్నాననీ, కనీసం గుర్తించండి అంటూ ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. డీసీసీ నియామకాలు ఇష్టం వచ్చినట్టు చేసేస్తారనీ, కనీసం ఆ సమాచారం కూడా తనకు ఇవ్వలేదన్నారు. పొత్తుల విషయం కూడా మీకు నచ్చినట్టే చేసేస్తారా… కనీసం ఒక మాటగానైనా సలహా తీసుకోరా అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియాల సమక్షంలో నిలదీశారు. తెల్లారితే ఎన్నికలు పెట్టుకుని హడావుడిగా సమావేశాలు పెడితే ఏం ఉపయోగం అని ప్రశ్నించారు. దీంతో కుంతియా స్పందించి… అందరికీ ముందుగానే సమాచారం ఇచ్చామనీ, మీరే ఆలస్యంగా స్పందించారన్నారు. దీంతో ఆమె మరింత అసంతృప్తికి గురైనట్టు సమాచారం.
రేణుకాతోపాటు ఈ సమావేశంలో పాల్గొన్న ఇతర సీనియర్లు కూడా నాయకత్వం మీద అసంతృప్తి వెళ్లగక్కినట్టు సమాచారం. అయితే, మున్సిపల్ ఎన్నికల ప్రచార బాధ్యతల్ని సీనియర్ల మీదే పెట్టడం విశేషం! నాయకత్వం మీద ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్న సీనియర్లు… ఇప్పుడు పార్టీ తరఫున ప్రచారం చేయాలంటే మనస్ఫూర్తిగా చేస్తారా అనేదే ప్రశ్న? మీ అనుభవాన్ని ఉపయోగించండని సులువుగా ఉత్తమ్ చెప్పేశారుగానీ… రాష్ట్ర స్థాయి నాయకుల్ని మున్సిపాలిటీల స్థాయికి పరిమితం చేస్తున్నారన్న అవమానంగా వారు ఫీలౌతున్నారు. రేణుకా చౌదరి కూడా ఇదే ఆవేదనను సమావేశం అనంతరం తన సన్నిహితులతో వ్యక్తం చేశారట!