తాను వైసీపీని వీడి టిడిపిలో చేరే ప్రసక్తి లేదని కర్నూలు ఎంపి బుట్టా రేణుక స్పష్టీకరించారు. ఇటీవల మంత్రి నారా లోకేశ్‌ను కలిసింది కేవలం అభివృద్ధి కార్యక్రమాల కోసమే నని కూడా ఆమె బల్లగుద్ది చెబుతున్నారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఆమె గైర్ హాజరైనా తమతోనే వుందని మేకపాటి రాజమోహనరెడ్డి గతంలోనే వివరించారు. ఈ మధ్య జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశాల్లోనూ ఆమె పాల్గొన్నారు. ఇంత జరిగాక ఆమె పార్టీ మారడం సులభం కాదు. పైగా ఫిరాయింపుల చట్టం అమలులో ఎంఎల్ఎల కంటే ఎంపిలపై ఎక్కువగా అనర్హత వేటు పడటం చూస్తాం. 2014 ఎన్నికల ఫలితాలు రాగానే చంద్రబాబును కలిసిన రేణుకపై అప్పటి నుంచి వూహాగానాలు వున్నా ఎలాగో వైసీపీలోనే నెట్టుకొస్తున్నారు. భర్త మాత్రం ప్రభుత్వ వర్గాలతో సన్నిహితంగా వుండేవారు. అయితే ప్రస్తుత ఖండనలో ఆమె ఆయన కూడా టిడిపిలో లేరని తేల్చిపారేశారు. బిజెపితో వైసీపీ సన్నిహితం కావడమే గాక రాయలసీమలో కీలక నేతలు అనేకమంది ఆ పార్టీలోకి వచ్చే సూచలు కనిపిస్తున్నాయి గనక ఇప్పుడు తాను హడావుడి పడాల్సింది లేదని ఆమె భావించివుండొచ్చు. వెళ్లిన శిల్పా మోహనరెడ్డి వంటి వారే ఇప్పుడు వైసీపీలో చేరి నంద్యాల అభ్యర్థులవుతున్నారు. టిడిపిలోకి వెళ్లినా ఎదురీత తప్పదన్న అంచనా కూడా ఆమెకు వుండొచ్చు. నంద్యాల ఉప ఎన్నిక పలితం రాష్ట్ర రాజకీయాలకే ఒక సంకేతం అవుతుందనుకుంటున్న సమయంలో రేణుక కూడా అందుకోసం ఎదురు చూడొచ్చు. టిడిపిలోకి మారే అవకాశమే వుంటే ఇంత బలంగా వివరంగా ఖండించి వుండేవారు కాదు. అయితే ఈ క్రమంలో ఆమెను ఇటూ అటూ కూడా నమ్మడం కొంత కష్టమైతే కావచ్చు. దానికి చేయగలిగింది వుండదు.