మొద్దు శీనును జైలు బయట హత్య చేసి ఓం ప్రకాష్ ఉన్న బ్యారక్ లోపల వేశారా..? . అవుననే అంటున్నారు.. అప్పట్లో… మొద్దు శీను హత్యకు గురైన సమయంలో న్యాయమూర్తిగా ఉన్న రామకృష్ణ. ఆయన ప్రస్తుతం… ఈశ్వరయ్య టేపుల వివాదంలో.. కీలకంగా ఉన్నారు. దళితుడైన రామకృష్ణ… జస్టిస్ నరసింహారెడ్డిపై అభిశంసన ప్రక్రియకు ఫిర్యాదు చేసి.. సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఆయన వివిద కారణాలతో సస్పెండ్ అయ్యారు. ఎనిమిదేళ్ల నుంచి ఆయనకు పోస్టింగ్ లేదు. తాజాగా.. ఆయనను ఈశ్వరయ్య బుజ్జగించి.. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయించేందుకు ప్రొత్సహించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆడియో టేపును కోర్టుకు సమర్పించిన రామకృష్ణ.. రోజుకో కొత్త విషయం బయట పెడుతున్నారు.
అప్పట్లో మొద్దు శీనును జైల్లో తాను రామకోటి రాసుకుంటూండగా.. డిస్టర్బ్ చేశాడని.. డంబెల్స్‌తో కొట్టి చంపానని ఓంప్రకాష్ ఒప్పుకున్నట్లుగా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అప్పట్లో.. న్యాయమూర్తిగా ఉన్న రామకృష్ణ ఎదుటే.. ఓం ప్రకాష్‌ను హాజరు పరిచారు. అప్పుడే .. మొద్దు శీను హత్యతో తనకేం సంబంధం లేదని… విలపించారని.. మొద్దు శీనును బయట చంపేసి.. బ్యారక్‌లో పడేశారని.. చెప్పారని.. తాను తన రిపోర్ట్‌లో అదే చెప్పానని రామకృష్ణ చెబుతున్నారు. ఇంతటితో ఆగిపోలేదు.. ఆయన… ఈశ్వరయ్య ప్రస్తావన తీసుకు వచ్చారు. ఈ ఘటన జరిగిన తర్వాత… కేసును తప్పుదోవ పట్టించేందుకు హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఈశ్వరయ్య.. అనంతపురం జిల్లా జిల్లా జడ్జిని కలిశారని రామకృష్ణ ఆరోపిస్తున్నారు. ఈ కేసును ఆయన ప్రభావితం చేశారని అంటున్నారు.
మొద్దు శీను హత్య కేసును మళ్లీ విచారించాలని.. రామకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. ఎనిమిదేళ్లుగా పోస్టింగ్ లేని రామకృష్ణ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. రోజుకో కొత్త విషయాన్ని బయట పెడుతున్నారు. ఈశ్వరయ్య అంశాన్ని హైకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు కొత్తగా మొద్దు శీనును బయటే చంపేసి.. బ్యారక్‌లో తీసుకొచ్చి పడేశారనే అంశాన్ని కూడా వెలుగులోకి తెచ్చారు. ముందు ముందు ఇంకెన్ని విషయాలు బయటపెడతారో చూడాలి..!