తెలుగు రాష్ట్రాల శాసనసభల స్ధానాలు పెరుగుతున్నాయని తెలుగుదేశం, టిఆర్ఎస్ ప్రచారం మొదలు పెట్టాయి. “అవును అవును…” అని బిజెపి వంతపాడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో వున్న 175 అసెంబ్లీ సీట్లకు అదనంగా మరో 50 స్ధానాలు కలుస్తాయని తెలుగుదేశం పార్టీలో అధినేత చంద్రబాబు స్వయంగా చెబుతున్నారు. అలాగే తెలంగాణాలో ఇపుడున్న 119 స్ధానాలకు అదనంగా 34 కలిసి మొత్తం సీట్లు 153 కి పెరుగుతుందని ఆరాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఢిల్లీలో చెప్పారు. ఆమేరకు తాము ఇచ్చిన హామీపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి హామీ ఇచ్చారని ఆయన వివరించారు. శాసన సభలు తీర్మానం చేస్తే సీట్ల సంఖ్య పెంచడంలో సమస్య వుండదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు విలేకరుల ప్రశ్నకు సమాధానంగా నమ్మబలికారు.
తెలుగుదేశం లీకు, టిఆర్ఎస్ విన్నపం, బిజెపి అగ్రనాయకుడి సునాయాస వాగ్ధానం కలగలసిపోయి తెలుగు రాష్ట్రాల్లో ఇపుడున్నవారికి అదనంగా మరో 84 మంది ఎమ్మెల్యేలు గా ఎన్నిక కాబోతున్నారన్న సందడిని సృష్టిస్తోంది. ఇది తెలంగాణాలో తెలుగుదేశం నుంచి టిఆర్ఎస్ లోకి, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి దూకేసిన, దూకేస్తున్న, దూకేయబోతున్న ఎమ్మెల్యేల అనుచరులను, మద్దతుదారులను హుషారెక్కిస్తోంది. పార్టీలు మారిపోయినా తమనాయకులకు వచ్చే ఎన్నికల్లో టికెట్ కి ఢోకా వుండదన్న ఉత్సాహం పెరుగుతోంది.
అయితే, సీట్లు పెరగడంలో మూడు అవరోధాలు వున్నాయి. ఒక ప్రాంతంలో ఒకే రకమైన ఆర్ధిక, రాజకీయ, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం పాతుకునిపోకుండా, కొత్తవారికి సహజమైన అవకాశాలు ఇచ్చేవిధంగా నియోజకవర్గాలను పునర్విభజించే విధానాన్ని రాజ్యాంగ చట్టం ప్రవేశపెట్టింది. ప్రజల విజ్ఞాపనలు వుంటే రెండు దశాబ్దాలకు ఒకసారి హద్దులు మార్చి నియోజక వర్గాలను పునర్విభజన చేస్తారు. ఆహద్దు లోపల జనాభా దామాషాను బట్టి రిజర్వుడు స్ధానాలు కూడా మారుతాయి. ఈ ప్రకారం 2026 వరకూ నియోజక వర్గాల పునర్విభజన జరగదు.
పునర్విభజనపై గాఢమైన రాజకీయ ఆకాంక్ష వుంటే రాజ్యాంగ సవరణ ద్వారా పునర్విభజన సాధ్యమే! లోక్ సభలో, రాజ్యసభలో పునర్విభజన ప్రతిపాదన నెగ్గాలి. దేశవ్యాప్తంగా వున్న రాష్ట్రాల్లో సగం రాష్ట్రాల అసెంబ్లీలు దాన్ని ఆమోదించాలి..భూసేకరణ బిల్లుని, గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ బిల్లుని రాజ్యసభలోనే ఆమోదించుకోలేని నిస్సహాయ స్ధితిలో వున్న కేంద్రం, తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల బిల్లుని నెత్తికెత్తుకునే పరిస్ధితే లేదు.
కేంద్రంలో కాంగ్రెస్ కు సంపూర్ణ మెజారిటీ, సగానికి పైగా రాష్ట్రాల్లో తిరుగులేని మద్దతు వున్నపుడు 1975 లో ఇందిరాగాంధీ – లోక్ సభ, శాసన సభల పదవీకాలాన్ని 7 ఏళ్ళకు పెంచుతూ రాజ్యాంగ సవరణ తెచ్చారు. ఆ తరువాత ఎన్నికల్లో ఆమె నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయి అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం పాత ప్రభుత్వపు నిర్ణయాలను రద్దు చేసింది.
రాజ్యాంగ సవరణకు, సవరణను రద్దు చేయడానికి అవసరమైనంత బలం ఇపుడు ఏపార్టీకీ లేదు. కేంద్రంలోని బిజెపికాని, ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం కాని తెలంగాణాలోని టిఆర్ఎస్ కాని సవరణకు ఒకవేళ మద్దతు కూడగట్టారనే అనుకుందాం…తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పునరావాసాలు సమృద్ధిగా వుంటాయి. ఇలాంటి అవకాశాలు అన్ని రాష్ట్రాల్లో కావాలని అన్ని రాజకీయపార్టీలూ డిమాండు చేయకుండా ఊరుకోవుకదా! అది తేనెతుట్టను రాయిపెట్టి కొట్టడం కాదా? బుద్ధిజ్ఞానాలు వున్న వాళ్ళు ఈ పని చేస్తారా?
ఏవిధంగా చూసినా “2019 ఎన్నికలకు తెలుగు రాష్ట్రాల శాసనసభ సీట్లు పెరిగే అవకాశం లేదు. పొలిటికల్ నీడ్ గట్టిగా డిమాండ్ చేస్తూంటే గుట్టుగా, లాబీయింగ్ ద్వారా చేసుకోవలసిన పనికి స్వయంగా నాయకులే ప్రచారంలో పెట్టడం ఏమిటో అర్ధకావటం లేదు” అని రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ వ్యాఖ్యానించారు.