కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఇప్పుడు ఉపరాష్ట్రపతి కాబోతున్నారు. నిజానికి, ఆయన ఆంధ్రా నుంచి రాజ్యసభకు ఎన్నికైన సందర్భమే గతంలో లేదు. రెండుసార్లు కర్ణాటక నుంచి, ఇప్పుడు రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ, వెంకయ్య నాయుడు అంటే ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేతగానే మంచి గుర్తింపు ఉంది. దానికి తగ్గట్టుగా ఆయన కూడా ఏపీ వ్యవహారాలపై జాతీయ స్థాయిలో చాలా యాక్టివ్ గా ఉంటూ వచ్చారు. అయితే, ఇప్పుడు ఆయన ఉప రాష్ట్రపతి కాబోతూ ఉండటం ఆంధ్రాకి లోటుగానే టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీకి సంబంధించిన వ్యవహారాలపై ప్రధానితో మాట్లాడాలన్నా, వివిధ పథకాలకు సంబంధించి ఫైళ్ల పురోగతిపై ఢిల్లీ పెద్దలతో చర్చించాలన్నా వెంకయ్య సహకారం ఏపీ సర్కారుకు ఎప్పుడూ ఉండేది. అయితే, ఇప్పుడు ఆయన పెద్ద పోస్ట్ కి ప్రమోట్ కావడంతో ఆంధ్రాకు మరో కేంద్రమంత్రి పదవి కావాలనే వాదనను టీడీపీ వినిపించబోతున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతోంది. కేంద్రం నుంచి ఇంకా సాయం అందాల్సి ఉంది. విభజన అనంతరం ఇప్పటికీ పెండింగ్ ఉన్న సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నా ఏపీకి చెందినవారికి మరో కేంద్రమంత్రి పదవి కావాలనీ, దాంతో కేంద్రంతో సంప్రదింపులు ఈజీగా ఉంటుందనే అభిప్రాయాన్ని టీడీపీ వ్యక్తీకరించబోతున్నట్టు సమాచారం. వెంకయ్య నాయుడు కేంద్ర క్యాబినెట్ లో లేకపోవడం కొంత లోటే అనే అభిప్రాయం భాజపా పెద్దల నుంచి కూడా వినిపిస్తోంది. అయితే, ఇప్పటికే ఏపీ నుంచి ఇద్దరు టీడీపీ మంత్రులు కేంద్రంలో ఉన్నారు. విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతి ఉన్నా… ఆ శాఖ పరిధి దాటి సొంత రాష్ట్రం కోసం ఆయన ఏమీ చేయలేని పరిస్థితి. ఇతర శాఖలతో ఆయన చొరవగా సంప్రదించిన సందర్భాలేవీ అనుభవంలో లేవు! సహాయమంత్రిగా ఉంటున్న సుజనా చౌదరి విషయానికొస్తే… ఏపీ వ్యవహారాలపై ఢిల్లీ కాస్త చురుగ్గా ఉంటారు. కానీ, ఆయన శాఖ రాష్ట్రానికి ఏమంత మేలు చేసేది కాదు! ఒకవేళ ఈ విన్నపాన్ని భాజపా పరిగణనలోకి తీసుకుంటే.. సుజనాకి క్యాబినెట్ హోదా ఇచ్చే అవకాశం ఉందనే ఆశాభావంతో టీడీపీలో వ్యక్తమౌతోంది.
ఇదే తరుణంలో ఏపీ భాజపా నేతల్లో కూడా ఇదే చర్చ జరుగుతోందట! వెంకయ్యను కీలక శాఖ నుంచి దూరం చేయడం ద్వారా ఏపీకి లోటు చేశామనే భావన కలగకుండా ఉండేందుకు.. ఏపీ భాజపాకి చెందినవారికే అవకాశం ఇస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తమౌతోందట. దీంతో విశాఖ ఎంపీ హరిబాబుకు అవకాశం దక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఆయన ఎప్పట్నుంచో మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి, వెంకయ్య నాయుడు హోదా మారేసరికి… ఏపీకి మరో మంత్రి పదవి రావొచ్చనే చర్చ ఊపందుకుంది. అయితే, దానిపై కేంద్రం స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.