ఆంధ్రప్రదేశ్‌లో ఐదు చోట్ల ఆరో తేదీన రీపోలింగ్ పెట్టాలని.. ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ ఐదు చోట్ల రీపోలింగ్ కి సిఫార్సు చేశామని… ఢిల్లీ నుంచి అనుమతి వచ్చిన తర్వాత… పెడతామని.. ద్వివేదీ చాలా సార్లు చెప్పారు. అయితే.. ఐదు పోలింగ్ బూతులన్నారు కానీ.. ఏ కారణాలో మాత్రం చెప్పలేదు. ఎందుకంటే.. ఆయా పోలింగ్ బూత్‌లలో… పోలింగ్ ఏ మాత్రం ఆగలేదు. చివరి వరకూ సాగింది. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే.. ఏ తప్పు జరిగిందో మాత్రం… వివరించడానికి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు… పోలింగ్ తేదీలు ప్రకటిచిన తర్వాత మాత్రం.. ఆ వివరాలు చెప్పారు.. ఏపీ ఎన్నికల సంఘం అధికారులు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 244 పోలింగ్ బూత్‌లో రీపోలింగ్ పెట్టారు. దీనికి కారణం శాంతిభద్రతల సమస్య.. అని ఈసీ చెబుతోంది. రికార్డుల ప్రకారం చూస్తే.. అక్కడ ఆ కారణంగా పోలింగ్ ఏమీ ఆగిపోలేదు. అంతకంటే పెద్ద పెద్ద ఉద్రిక్తతలు చాలా చోట్ల ఏర్పడ్డాయి. అయినా ఎక్కడా రీపోలింగ్ లేదు. ఇక నరసరావు పేట నియోజకవర్గంలో కేసనపల్లి 94 బూత్ లోనూ రీపోలింగ్ జరగబోంది. ఉదయం ఈవీఎం మొరాయించినప్పుడు.. క్యూలో ఉన్న వారికి ఆర్వో… పోలింగ్ జరగదని చెప్పారట. ఆ కారణంగా కొంత మంది వెళ్లిపోయారని… అందుకే రీపోలింగ్ పెడుతున్నామని ఈసీ చెబుతోంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కలనూతల 247 బూత్ లో ఈవీఎం స్లీపింగ్ మోడ్ లోకి వెళ్ళిపోయిందట ఈ కారణంగా యాభై మంది ఓటు వినియోగించుకోలేక పోవడం వల్ల… అందరితో మళ్లీ ఓట్లు వేయిస్తున్నారట.. ఈసీ అధికారులు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇసుకపల్లి- పల్లి పాళెం పోలింగ్ బూత్ నెంబర్ 41 , సూళ్లూరుపేట నియోజకవర్గం అటకానితిప్పలోని పోలింగ్ బూత్ నెంబర్ 197ల్లో కేవలం పార్లమెంట్ స్థానానికి మాత్రమే రీపోలింగ్ చేస్తున్నారు. అక్కడ ఈవీఎంల సమస్య వచ్చిందట.
ఈసీ చెప్పిన ఈ కారణాల ప్రకారం చూస్తే… సగానికి సగం పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ పెట్టాల్సి ఉంటుందనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. సహజంగా… ఏ పోలింగ్ కేంద్రంలో అయినా.. రెండు గంటల పాటు… పోలింగ్ ఆగిపోతే.. రీపోలింగ్ పెట్టాలనే నిబంధన ఉంది. కానీ.. పోలింగ్ ఆలస్యమైన చోట.. అర్థరాత్రి వరకైనా… కొనసాగించారు కాబట్టి.. ఆ అవసరం లేదని చెబుతున్నారు. కానీ.. ఉదయం పది గంటల వరకు 30 శాతం ఈవీఎంలు మొరాయించాయి. అన్ని చోట్లా.. పోలింగ్ ఆలస్యమయింది. చాలా మంది వెనక్కి వెళ్లిపోయారు కూడా. ఇప్పుడు.. నర్సరావుపేట పోలింగ్ బూత్‌లో 50 మంది వెనక్కి వెళ్లిపోయారని లెక్కలు చెబుతున్న ఈసీ.. మరి మిగతా చోట్ల.. వెనక్కి వెళ్లిపోయిన వారి గురించి ఎందుకు పట్టించుకోలేదో మరి..!?