అమెరికాలో అనూహ్య ఘటన. ప్రత్యక్ష ప్రసారంలో ఓ మహిళను ఇంటర్ వ్యూ చేస్తున్న మహిళా విలేకరిని, కెమెరామెన్ ను ఓ దుండగుడు కాల్చి చంపాడు. వర్జీనియాలో జరిగిందీ దారుణం. ఓ ఇంటి డాబాపై మహిళను ఇంటర్ వ్యూ చేస్తుండగా దుండగుడు హటాత్తుగా వెనక వైపు నుంచి వచ్చాడు.
డబ్బ్యు డి బి జె 7 చానల్ కు చెందిన కెమెరామెన్ ను, రిపోర్టర్ ను, ఇంటర్ వ్యూ ఇస్తున్న మహిళను పిస్టల్ తో కాల్చాడు. ఈ ఘటనలో 24 ఏళ్ల రిపోర్టర్ అలిసన్ పార్కర్, 27 ఏళ్ల కెమెరామన్ ఆడమ్ వార్డ్ మరణించాడు. గాయపడ్డ మరో మహిళను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో సర్జరీచేసి ఆమెకు ప్రాణాపాయం తప్పించారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
గతంలో అదే చానల్ లో పనిచేసిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. సరిగా పనిచేయక ఉద్యోగం లోంచి తీసేసిన వ్యక్తి పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. చానల్ యాజమాన్యం కూడా ఇదే అనుమానం వ్యక్తం చేసింది. దుండగుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
అయితే కొన్ని టీవీచానళ్లు హటాత్తుగా ఓ బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేశాయి. రిపోర్టర్ ను, కెమెరామన్ ను కాల్చి చంపిన దుండగుడు తనను తాను కాల్చుకున్నాడని తెలిపాయి. అయితే అతడు మరణించాడా లేక సజీవంగా ఉన్నాదా అనేది నిర్ధారించలేదు. పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని అధికారికంగా నిర్ధారించలేదు.