ఈ సంక్రాంతికి ఏకంగా 5 సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మధ్యలో డబ్బింగ్ చిత్రాలూ కర్చీఫ్ వేయాలని చూశాయి. కానీ.. చోటు దక్కలేదు. కనీసం ఒక్క తెలుగు సినిమా అయినా వాయిదా వేసుకొంటే, మిగిలిన 4 చిత్రాలకూ మంచి జరుగుతుందని నిర్మాతలు భావించారు. విడుదల చేసుకొనే ఆ ఒక్క సినిమాకీ జనవరి 26 రిపబ్లిక్ డే నాడు సోలో రిలీజ్ అవకాశం కల్పిస్తామని తాయిలాలు ప్రకటించారు. కానీ ఎవ్వరూ తగ్గలేదు. సరికదా.. ఇప్పుడు ఆ రిపబ్లిక్ డే కూడా ఫుల్ అయిపోయింది. జనవరి 26న ఏకంగా 5 డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి. ఓ రకంగా జనవరి 26.. ‘డబ్బింగ్ డే’ అయిపోయింది.
విక్రమ్ కథానాయకుడిగా పా.రంజిత్ దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న ‘తంగలాన్’ జనవరి 26న విడుదల కానుంది. రజనీకాంత్ ‘లాల్ సలామ్’ కూడా రిపబ్లిక్ డే రోజే ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. నిజానికి ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేద్దామనుకొన్నారు. కానీ థియేటర్లు దొరకడం లేదు. ధనుష్ హీరోగా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ జనవరి 12న విడుదల కానుంది. అయితే తెలుగులో మాత్రం కాస్త ఆలస్యంగా రిపబ్లిక్ డే రోజున తీసుకొస్తారు. హన్సిక ప్రధాన పాత్ర పోషించిన ‘105 మినిట్స్’, మోహన్ లాల్ నటించిన ‘మలైకోటై వాలిబన్’, హృతిక్ రోషన్ ‘ఫైటర్’ జనవరి 25న వస్తున్నాయి. ఇవన్నీ డబ్బింగ్ సినిమాలే. తెలుగు నుంచి కూడా ఒకట్రెండు సినిమాల్ని జనవరి 26న చూసే వీలుంది.