ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో.. ఊహించడం కష్టంగా మారింది. విశాఖలో రిపబ్లిక్ డే వేడుకలు జరపాలని.. నెల రోజుల కిందట నిర్ణయించి.. ఆ మేరకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. పలువురు ఉన్నతాధికారులు.. వెళ్లి ఏర్పాట్లపై సమీక్షలు చేసి వచ్చారు. అనూహ్యంగా.. రిపబ్లిక్ డే వేడుకలకు నాలుగు రోజుల ముందు.. వేదికను.. విజయవాడకు మార్పు చేస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అవాక్కవడం.. అధికారుల వంతు అయింది. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు జరపనున్నారు. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత.. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖను నిర్ణయించిన తర్వాత.. అక్కడ రిపబ్లిక్ డే వేడుకలు జరపాలనుకున్నట్లుగా.. గతంలో ప్రచారం జరిగింది.
ఏర్పాట్లు చేసిన తర్వాత కూడా.. ఎందుకు.. అనూహ్యంగా వేదికను మార్పు చేశారన్నదానిపై.. రకరకాల చర్చలు జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్గా విశాఖను ప్రకటించిన తర్వాత అత్యంత ఆడంబరంగా.. కార్యక్రమం నిర్వహించాలని అనుకుంటున్నారని.. రిపబ్లిక్ డే వేడుకలతో అది సాధ్యం కాదని భావించినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి విజయసాయిరెడ్డి గత మూడు రోజులుగా విశాఖలోనే మకాం వేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ఎస్పీలతో.. సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.
ఎజెండా ఏమిటో బయటకు రాలేదు. కానీ.. ఎగ్జిక్యూటివ్ కేపిటల్గా అసెంబ్లీలో చట్టం చేయబోతున్న సమయంలో.. వీలైనంత త్వరగా..అధికార యంత్రాంగాన్ని మొత్తం విశాఖకు తరలించేందుకు.. విజయసాయిరెడ్డి సన్నాహాలు చేస్తున్నారంటున్నారు. పూర్తిగా విశాఖ మీద దృష్టి కేంద్రీకరించిన సమయంలో.. ఇలా హఠాత్తుగా.. రిపబ్లిక్ డే వేడుకలను.. విజయవాడకు మార్చడం.. చర్చనీయాంశం అవుతోంది.