రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్ గోస్వామి, మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న సమరం అరెస్టులకు దారి తీసింది. ఆర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు ఉదయం అరెస్ట్ చేశారు. గతంలో రిపబ్లిక్ టీవీ కోసం పని చేసిన ఇంటీరియర్ డిజైనర్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్నాబ్ గోస్వామి డబ్బులు చెల్లించనందునే మనస్తాపానికి గురై వారు ఆత్మహత్య చేసుకున్నట్లుగా గతంలో కేసు నమోదయింది. ఆ కేసులో ఆర్నాబ్‌ను ఇప్పుడు అరెస్ట్ చేసినట్లుగా ముంబై పోలీసులు ప్రకటించారు. ఆర్నాబ్‌పై భౌతికంగా దాడి చేశారని రిపబ్లిక్ టీవీ ఆరోపించింది. ఆయనను వైద్య పరీక్షల తర్వాత కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.
కొంత కాలంగా ఆర్నాబ్ వర్సెస్ మహారాష్ట్ర గవర్మమెంట్ అన్నట్లుగా వార్ జరుగుతోంది. బీజేపీతో సంబంధాలు వదులుకుని కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి రిపబ్లిక్ టీవీ శివసేనను టార్గెట్ చేసింది. ఏక పక్షంగా వార్తలు ప్రసారం చేస్తోంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసును.. హత్య కేసు అన్నట్లుగా స్వయం ఇన్వెస్టిగేట్ చేసింది. ఉద్దవ్ ధాకరే కుమారుడిపై ఆనుమానాలు వ్యక్తం చేసింది. బాలీవుడ్ ను టార్గెట్ చేసింది. ఆ తర్వాత.. టీఆర్పీ స్కామ్‌లో రిపబ్లిక్ టీవీపై కేసులు నమోదయ్యాయి.
ఆర్నాబ్ గోస్వామి అరెస్ట్‌పై జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. ఎడిటర్స్ గిల్డ్ తాము షాక్‌కు గురయ్యామని తెలిపింది. అయితే ఆర్నాబ్ గోస్వామిని జర్నలిజానికి సంబంధం లేని కేసులో అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు. ప్రస్తుతం రిపబ్లిక్ టీవీ చేస్తున్న ప్రసారాలకు.. అరెస్ట్‌కు సంబంధం లేదంటున్నారు. అయితే రిపబ్లిక్ టీవీ మాత్రం.. ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసు ఎప్పుడో పరిష్కారమయిందని చెబుతోంది. మొత్తానికి ఆర్నాబ్ అరెస్ట్ అటు రాజకీయ రంగంలోనూ.. ఇటు మీడియాలోనూ చర్చనీయాంశం అవుతోంది.