వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన కొంత మంది.. ప్రభుత్వంలో భాగమైన వారు… విదేశాల్లో అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నారా..? అత్యంత భారీ మొత్తంలో ఉన్న ఈ లావాదేవీలపై… విదేశీయులు కొంత మంది కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారా..? కేంద్రం రంగంలోకి దిగి.. విచారణ జరిపి నిజాలను నిగ్గు తేలుస్తోందా..? ఇప్పటికే కీలకమైన సమాచారం కనిపెట్టిందా..?… అన్ని అనుమానాలను… భారతీయ జనతా పార్టీ మౌత్ పీస్‌గా పేర్కొనే రిపబ్లిక్ టీవీ ప్రజల్లోకి పంపేసింది. జగన్‌కు ట్రబుల్ అంటూ…. ప్రైమ్ టైమ్‌లో ప్రసారం చేసిన ఓ కథనం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.
రిపబ్లిక్ టీవీ కారణాలు లేకుండా వార్తలు ప్రసారం చేయలేదు. ఆ చానల్ మొత్తం బీజేపీ రాజకీయ వ్యూహాల ప్రకారమే ప్రసారాలు చేస్తుంది. ఆ పార్టీకి ప్రభుత్వానికి ఎంత సన్నిహిత సంబంధాలు ఉంటాయంటే… మిలటరీ సీక్రెట్స్ అయిన సర్జికల్ స్ట్రయిక్స్ గురించి కూడా… ఆ చానల్‌కు ముందస్తుగానే సమాచారం వస్తుంది. అలాంటిది…. జగన్మోహన్ రెడ్డి చిక్కుల్లో పడబోతున్నారని.. చెప్పిందంటే.. దాని వెనుక కీలకమైన అంశం ఏదో ఉందనే అనుమానాలు… జాతీయ రాజకీయనాయకుల్లో ప్రారంభమయ్యాయి. అందుకే అందరూ జగన్ వైపు చూస్తున్నారు. ఇంతా చేసి… ఆ కథనంలో రిపబ్లిక్ టీవీ డీప్‌గా వివరాల్లోకి వెళ్లలేదు. అంతర్జాతీయంగా ఆర్థిక లావాదేవీలు అనుమానాస్పదంగా నిర్వహిస్తున్న వ్యవహారాల్లో.. విదేశీయులు కేంద్రానికి ఫిర్యాదు చేశారని మాత్రమే ఉంది. ఇలా చేస్తోంది.. జగన్మోహన్ రెడ్డి సన్నిహితులనేది ఆ కథనం సారాంశం. అందుకే జగన్‌కు ట్రబుల్ అని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. విపక్షాలు జే ట్యాక్స్ అని.. మరొకటని చెబుతూ.. పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. ఒక్క మద్యం వ్యాపారం విషయం మాత్రమే కానీ.. దాదాపుగా ప్రతీ వ్యాపారంలోనూ.. భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. అన్నింటిలోనూ వసూళ్లు చేస్తున్నారని… సీఎం జగన్ సంపాదన నెలకు రూ. మూడు వందల కోట్లని.. జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్లు చెబుతూ ఉంటారు. కానీ అవన్నీ రాజకీయ ఆరోపణలు గానే ఉంటాయి. రిపబ్లిక్ టీవీ లాంటి చానళ్లు… ఇలాంటి కథనాలు ప్రసారం చేసినప్పుడు మాత్రమే… వీటిని గుర్తుకు తెచ్చుకుంటారు.
రిపబ్లిక్ టీవీ.. పూర్తిగా చెప్పీ చెప్పకుండా… వైఎస్ జగన్ తో పాటు ఆయన సన్నిహితుల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయని… ఆధారాలు ఉన్నాయని.. ప్రకటించడం … ఓ రకంగా భయపెట్టడం లాంటిదన్న అనుమానాలు కూడా కొంత మందిలో ఉన్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సపోర్ట్‌ను ఏదో విధంగా ఆశిస్తున్న బీజేపీ.. ఇలా.. రిపబ్లిక్ టీవీ ద్వారా… సంకేతాలు పంపుతోందన్న సందేహాలు కూడా.. తెర వెనుక రాజకీయాలపై విశ్లేషణ చేసే వారు… వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇప్పటికి అనేక సార్లు జగన్ అండ్ కో ఆర్థిక అవకతవకలపై చర్చలు జరిగాయి. నిమ్మగడ్డ లాంటి వాళ్లను సెర్బియాలో పట్టుకున్నప్పుడు.. తీగ లాగే చాన్స్ వచ్చింది. కానీ ఏమీ చేయలేదు కాబట్టి.. ఇది కూడా అలాంటిదేనని అనుకుంటున్నారు. అయితే.. అల్ ఈజ్ నాట్ వెల్ అని మాత్రం జగన్ బృందానికి రిపబ్లిక్ టీవీ సంకేతాలు పంపిందని అర్థం చేసుకోవచ్చు.