ఇళ్లు కొనుగోలు చేసే వారు మోసపోకుండా అండగా ఉండటంలో రెరా చట్టం ఎక్కువగా ఉపయోగపడుతోంది. ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ కంపెనీ రెరాలో నమోదు చేసుకోవాలి. ప్రతి ప్రాజెక్టుకు అనుమతి పొందాలి. అలా అనుమతులు పొందిన వాటి దగ్గర కొనుగోలు చేస్తే .. కొనుగోలుదారులకూ రక్షణగా రెరా ఉంటుంది.
రెరా తాజాగా మరికొన్ని అదనపు రక్షణలను ఇళ్ల కొనుగోలుదారులకు కల్పించింది. చాలా కంపెనీలు ఇటీవలి కాలంలో బ్రోకర్ల ఫీజు వసూలు చేస్తున్నాయి. అంటే మధ్యవర్తిత్వం వహించిన వారికి చెల్లించే ఫీజును కూడా వసూలు చేస్తున్నారు. ఇది హిడెన్ చార్జీగా ఉంటోంది. ఇక నుంచి అమ్మకపు ఒప్పందంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు చెల్లించాల్సిన మొత్తాన్ని పేర్కొనడం తప్పనిసరి చేస్తూ రెరా నిర్ణయం తీసుకుంది. రిజిస్టర్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా డెవలపర్, కొనుగోలుదారు మధ్య అమలయ్యే అమ్మకపు ఒప్పందంలో కమీషన్, బ్రోకరేజ్ వంటివి స్పష్టంగా పేర్కొనాలని రెరా ఆదేశాలు జారీ చేసింది. సేల్ అగ్రిమెంట్లో గృహ కొనుగోలుదారులకు కేటాయించిన లేదా విక్రయించిన పార్కింగ్ స్థల వివరాలను తప్పనిసరిగా చేర్చాలని, భవిష్యత్తులో ఎలాంటి వివాదాలూ లేకుండా ఉండేందుకు కేటాయింపు లేఖను జారీ చేయాలని రెరా స్పష్టం చేసింది.
అలాగే 500 చదరపు మీటర్ల లోపు ప్లాట్లకు రెరా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. 500 చదరపు మీటర్ల కంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న ప్రాజెక్టులను రెరా రిజిస్ట్రేషన్ నుంచి మినహాయించారు. రియల్ డెవలపర్లు కొనుగోలుదారుదారుల నుంచి తీసుకున్న మొత్తాలను వివిధ బ్యాంకు ఖాతాల్లో జమ చేయకూడదనే రూల్ ఉంది. ఆర్థిక క్రమశిక్షణ, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి వారు ఒకే బ్యాంకులో ప్రతి ప్రాజెక్టుకూ మూడు ఖాతాలు నిర్వహించాలి. అయితే భూ యజమానులు కూడా ప్రమోటర్లు కిందనే వస్తారు వారు కూడా మూడు ఖాతాలు తెరవడంతో సమస్యలు వస్తున్నాయి. ఈ నిబంధనను సడలించారు. భూయజమానే బిల్డప్ కాకపోతే మూడు ఖాతాలు తెరవాల్సిన అవసరం లేదు.
ఇల్లు కొనాలనుకునేవారు ఈ అంశాలపై అవగాహన పెంచుకుంటే… కొన్ని కీలక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.