మధ్యతరగతి కుటుంబానికి సొంత ఇల్లు ఓ కల. వచ్చే పాతికేళ్ల జీవితాన్ని.. జీతాన్ని తాకట్టు పెట్టేసి ఇల్లు కొంటున్నారు. అలాంటప్పుడు మోసపోతే.. ఇక కోలుకునే అవకాశం ఉండదు. అటు ఇల్లు ఉండదు.. ఇటు ఇరవై ఏళ్ల జీతాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అందుకే అత్యంత జాగ్రత్తగా ఇల్లు, ఫ్లాట్ కొనే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
తక్కువ ధర అంటే అందులో మోసమే ఎక్కువ !
ఏ వ్యాపారంలో అయినా తక్కువ ధరకు ఇస్తున్నారంటే అందులో మతలబు ఉంటుంది. రియల్ ఎస్టేట్ లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. తక్కువ ధర అని నమ్మితే నట్టేట మునిగిపోయామని ఎంతో మంది వాపోతూంటారు. అందుకే… తక్కువ ధర పేరుతో ఇచ్చే ఆఫర్లను నమ్మకపోవడం మంచిది. ప్రీ లాంచింగ్ ఆఫర్లు… ఫ్లాట్లు కట్టిస్తామని నమ్మించి, డబ్బులు తీసుకుని ఏళ్ల తరబడి నిర్మాణం చేయకుండా వేధిస్తూంటారు. ఇంకొందరు ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇళ్లు నిర్మించి ఇస్తారు. దీని వల్ల ఎంతో ఆశపడి ఫ్లాట్ కొనుకున్నవాళ్లు తీవ్రంగా నష్టపోతూ ఉంటారు.
Read Also : ప్రీ లాంచ్ ఆఫర్లను నమ్మితే నట్టేట మునిగినట్లే !
రెరా అనుమతి తప్పని సరి !
స్థిరాస్తి వ్యాపారంలో అనేక సమస్యలు ఉంటాయి. ఇంటి నిర్మాణంలో నాణ్యత లోపాలు, పనుల్లో జాప్యం, మోసాలు, అవకతవకలు ఇలా చాలానే సమస్యలు ఉంటాయి. వీటిని నియంత్రించి, కొనుగోలుదారులకు బాసటగా నిలిచేందుకే కేంద్ర ప్రభుత్వం రెరా యాక్ట్‌ను తీసుకువచ్చింది. దీనిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండూ అమలు చేస్తున్నాయి. రెరా చట్టం ప్రకారం, ‘రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ’ అనుమతి లేకుండా ఏ స్థిరాస్తి ప్రాజెక్ట్ నిర్మించకూడదు. అమ్మకాలు జరపకూడదు. ఒక వేళ రెరా అనుమతి పొందిన స్థిరాస్తి విషయంలో ఏవైనా వివాదాలు ఏర్పడితే, రెరా న్యాయాధికారి ద్వారా తక్షణ న్యాయం పొందేందుకు అవకాశం ఉంది. రెరా అనుమతి లేని ప్రాజెక్టుల నుంచి న్యాయపరమైన రక్షణ పొందడం కష్టం.
రెరా చట్టం ప్రకారం వినియోగదారునికి రక్షణ
8 ప్లాట్లు లేదా 500 చ.మీ. దాటిన స్థలంలో నిర్మాణాలకు రెరా అనుమతి తప్పనిసరి. రెరా నుంచి అనుమతి పత్రం తీసుకోకుండా, నిర్మాణానికి సంబంధించిన ప్రకటనలు చేయకూడదు. కరపత్రాలు పంచకూడదు. గోడ పత్రికలను అంటించకూడదు. ప్రీలాంచ్ విక్రయాలు కూడా చేపట్టకూడదు. రెరా నిబంధనల ప్రకారం బిల్డర్లు కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన సొమ్ములో 70 శాతాన్ని ప్రత్యేక ఖాతాలో జమ చేయాలి.
ముందే అనుకున్న విధంగా నిర్మాణ పనులు సక్రమంగా జరుగుతున్నట్లు రుజువులు చూపించాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి జమా ఖర్చుల వివరాలను రెరా అథారిటీకి కచ్చితంగా సమర్పించాలి. ఆస్తి విలువలో 10 శాతం కంటే ఎక్కువగా కొనుగోలుదారుల నుంచి బయానాగా తీసుకోకూడదు. ఒక వేళ తీసుకోవాలంటే, ఇరువురి మధ్య సిఫార్సు చేసిన నమూనా ప్రకారం ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది.
అదనపు ఖర్చేమీ ఉండదు !
ఏదైనా లేఅవుట్లో స్థలం తీసుకోవాలన్నా, బహుళ అంతస్తుల నిర్మాణంలో ఫ్లాట్ కొనుగోలు చేయాలన్నా, ముందుగా దానికి రెరా రిజిస్ట్రేషన్ ఉందో, లేదో తెలుసుకోవాలి. ఏ పనిని, ఏ సమయంలోపు పూర్తి చేస్తారనే విషయాన్ని కూడా కచ్చితంగా చెప్పాలి. రియల్ ఎస్టేట్ కొనుగోళ్లు ఎక్కువగా మధ్యవర్తుల ద్వారానే జరుగుతుంటాయి. అందువల్ల మధ్యవర్తిని కూడా రెరా చట్టం పరిధిలోకి తీసుకురావాల్సి ఉంటుంది. ఒప్పందంలో పేర్కొన్న తేదీ నాటికి, నిర్మాణం పూర్తి చేసి, సదరు ఇంటిని లేదా ఫ్లాట్‌ను కొనుగోలుదారులకు అప్పగించాలి. గడువు దాటిన తరువాత కూడా ఇంటిని స్వాధీనపరచకపోతే, రెరా సిఫార్సు చేసిన వడ్డీని, ప్రతినెలా కొనుగోలుదారుకు చెల్లించాల్సి ఉంటుంది. నిర్మాణదారే 5 ఏళ్ల వరకు నాణ్యతా లోపాలకు బాధ్యుడిగా ఉంటాడు. అందుకే రెరా చట్టం వినియోగదారులకు రక్షణగా ఉంటోంది.