ఊరూ పేరూ తెలియనివాడు సర్వే చేసినా సరే…….అది ప్రభుత్వానికి అనుకూలంగా ఉందంటే చాలు….భజన పత్రికల ద్వారా మనవాళ్ళు చేయించుకున్న భజన అంతా ఇంతా ఉండదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తాను చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రపంచం అంతా ప్రశంసిస్తోందని చెప్పుకుంటాడు. ఒక రాష్ట్రంలో జరుగుతన్న అభివృద్ధి గురించి ప్రపంచ దేశాలు ఎందుకు మాట్లాడుకుంటాయి, ప్రపంచమంతా ఎందుకు ప్రశంసిస్తుంది అన్న కామన్సెన్స్ ఆ ముఖ్యమంత్రికి ఉండదు. ఓట్లేసిన జనాలకు కూడా ఉండదు అని గట్టిగా నమ్ముతారు. ఆ విషయం పక్కన పెడితే గత కొన్ని దశాబ్ధాలుగా మన నాయకులు అభివృద్ధి గురించి మామూలుగా గొప్పల డప్పాలు కొట్టుకోవడం లేదు. రాజీవ్, వాజ్‌పేయి, మన్మోహన్‌ల నుంచి ఇప్పటి మోడీ వరకూ అభివృద్ధి అంతా మేమే చేసేస్తున్నాం. ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి అని ప్రచారం చేసుకుంటున్నవాళ్ళే. ఇక చంద్రబాబు నాయుడు అయితే ప్రతి రోజూ కనీసం ఓ గంట సేపు అయినా ఆయన చేసిన అభివృద్ధి గురించి ఆయనే చెప్పుకుంటూ ఉంటాడు. శరవేగంగా అభివృద్ధి జరుగుతోంది అని చెప్పడం కోసం జనాలకు అర్థం కాని ఎన్నో లెక్కలు చెప్తూ ఉంటారు. అభివృద్ధి శాతం ప్రపంచంలోనే ఎక్కువగా ఉందని చెప్తూ ఉంటారు.
అభివృద్ధి జరిగిపోతోంది, అద్భుతమైన అభివృద్ధివైపు అడుగులేస్తున్నాం. ఐదు, పదేళ్ళలో ప్రపంచంలోనే మన దేశమే నంబర్ ఒన్‌గా నిలుస్తుంది అని ప్రధానమంత్రి చెప్తున్నారు. అదే ఐదు, పదేళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోనే ఓ గొప్ప రాష్ట్రంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఆ అభివృద్థి అంతా కేవలం అంకెల్లోనే ఉందని రీసెంట్గా వచ్చిన కొన్ని సర్వేలు చెప్తున్నాయి. బిలియనీర్ల, మిలియనీర్ల సంఖ్య మాత్రం పెరుగుతోంది. వాళ్ళ ఆస్తులు కూడా పెరుగుతున్నాయి. అది వాస్తవం. మన నాయకులు చెప్తున్న అభివృద్ధి అదేనేమో తెలియదు. అదే సమయంలో ప్రపంచ దేశాల్లోనే ఆనందంగా ఉన్న దేశాల జాబితా తీస్తే…మోడీ సారధ్యంలో శరవేగంగా అభివృద్ధి వైపు దూసుకెళుతున్న భారతదేశం, ఇంతకుముందు కాంగ్రెస్ పాలనలో ఎంతో అభివృద్ధి చెందిన భారతదేశం…..చివరి నుంచి టాప్ టెన్‌లో నిలిచేస్థాయిలో ఉంది. అంటే పాలకులు చెప్తున్న అభివృద్ధి లెక్కలతో భారతీయులు ఆనందంగా లేరనేగా అర్థం. ఇక మానవాభివృద్ధి సూచీలో కూడా మొత్తం 188 దేశాల్లో భారతదేశం 131వ స్థానంలో ఉంది. మరి ఆనందం లేని, మానవాభివృద్ధి సూచీలో కూడా దేశాన్ని చివరి స్థానాల్లో నిల్చోబెట్టిన అభివృద్ధి గురించి భారతీయులు గొప్పగా ఫీలవ్వాలా? అభివృద్ధి చేస్తున్నాం అని ప్రజలను నమ్మించడం కోసమే మన నాయకులు గిమ్మిక్కులు చేస్తున్నట్టుగా ఉంది కానీ మెజారిటీ భారతీయుల స్థితిగతులను తీసుకుంటే మాత్రం అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్స్‌గా ప్రచారం చేయించుకుంటున్న మన పాలకుల మాటలన్నీ ఉత్తర కుమార పలుకుల్లానే కనిపిస్తున్నాయి. అభివృద్ధివైపుగా లాక్కెళుతున్నాం….ఇబ్బందులున్నా మీరూ జై కొట్టాల్సిందే….అలా జై కొట్టకపోతే మీరు అభివృద్ధి నిరోధకులే అని గుడ్డిగా నడిచే మన పాలకుల కన్ను తెరిపించే శక్తి ఎవరికైనా ఉందా? నాయకులకు ఆత్మపరిశీలన చేసుకునే శక్తి ఉందా?