ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి రాజకీయ పార్టీలన్నీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి దీంతో బిల్లు పాసయిపోతుందా..? అంటే… నరేంద్ర మోడీ ఎన్నికలకు ముందు ఎంత పెద్ద జిమ్మిక్ గా… దీన్ని తెరమీదకు తీసుకొచ్చి ఓట్ల పంట పండించాలనుకుంటున్నారో.. అంతకు మించి.. రాజకీయం చేయాలని ఇతర పార్టీలు నిర్ణయించుకున్నాయి. ముఖ్యంగా.. ఇప్పటికే… తమ తమ రాష్ట్రాల్లోని బలమైన సామాజికవర్గాల ఓట్ల కోసం ఆయా వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తామని హామీలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు.. పార్టీలు.. ఈ విషయంలో.. కొత్త ఆలోచనలు చేస్తున్నాయి. ఈబీసీ రిజర్వేషన్ల కోసం.. రాజ్యాంగ సవరణ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాయి కానీ… షరతులు వర్తిస్తాయంటున్నారు.
తెలంగాణలో ముస్లింలకు పన్నెండు శాతం, ఎస్టీలకు పది శాతం మేర రిజర్వేషన్లు పెంచాలని… తెలంగాణ ప్రభుత్వం.. గతంలోనే అసెంబ్లీలో తీర్మానాలు చేసింది. ఆ తీర్మానాలు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ విషయాన్ని బయటకు తీశారు. ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతిస్తాం కానీ… తెలంగాణలో రిజర్వేషన్ల కోటా.. తాము కోరిన విధంగా ఉండేలా… సవరణలు కోరాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా.. ఇదే తరహా డిమాండ్ వినిపించారు. తాము కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. తీర్మానం పంపిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తీర్మానాన్న ఆమోదించి.. కాపుల రిజర్వేషన్ల బిల్లును… షెడ్యూల్ నైన్ లో పెడితే.. మద్దతిస్తామని ప్రకటించారు. ఇక ఇతర రాష్ట్రాన్ని గుజ్జర్లు, జాట్లు, మీనాలు, పటేళ్ల మద్దతు కోసం.. వివిధ రాజకీయ పార్టీలు కూడా.. ఇదే డిమాండ్ ను వినిపించనున్నాయి.
మొత్తానికి ఈబీసీ బిల్లును ఎవరూ వ్యతిరేకించడం లేదు. కానీ సవరణలు మాత్రం కోరుతున్నారు. ఆ సవరణలు చేయాలంటే… వంద శాతం.. సరిపోవు. ఎందుకంటే.. పార్టీలన్నీ.. తమకు పట్టు ఉన్న… ఓటు బ్యాంక్ గా ఉన్న సామాజికవర్గాలకు పెద్ద ఎత్తున రిజర్వేషన్లు కోరుతున్నాయి. పదమూడు రాష్ట్రాలకు చెందిన రిజర్వేషన్ల తీర్మానాలు కేంద్రం వద్ద ఉన్నాయి. వీటిలో బీజేపీ పాలిత రాష్ట్రాలు పంపినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు… ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. బిల్లును అందరూ సమర్థిస్తారు…కానీ అందరూ షరతులు పెడతారు. ఫలితంగా.. బిల్లుపై ఆమోద ముద్ర పడాలంటే.. చాలా కష్టపడాల్సి ఉంటుంది.